Telugu Global
Andhra Pradesh

'వ్యూహం' విడుదలకు బ్రేక్

వ్యూహం సినిమా టీడీపీని టార్గెట్ చేసేలా ఉందని, చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని... నారా లోకేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఇప్పుడిలా బ్రేక్ పడింది.

వ్యూహం విడుదలకు బ్రేక్
X

రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' సినిమా విడుదల ఆగిపోయింది. ఈరోజు(శుక్రవారం) సినిమా విడుదల కావాల్సి ఉండగా.. గురువారం అర్థరాత్రి తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. జనవరి 11న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.

వ్యూహం సినిమా టీడీపీని టార్గెట్ చేసేలా ఉందని, చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని... నారా లోకేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఇప్పుడిలా బ్రేక్ పడింది. వ్యూహం ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని కూడా ఆయన కోర్టులో సవాల్‌ చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్‌ ను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుఇచ్చింది.

వైసీపీ అండ..

వ్యూహం సినిమాకు వైసీపీ అండ ఉందనే విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకణ సమయంలో రెండు మూడుసార్లు సీఎం జగన్ ని కలిశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు, ఓ రేంజ్ లో ప్రమోషన్ చేపట్టారు. తీరా సినిమాకి బ్రేక్ పడటంతో వ్యూహం తారుమారైంది.

కాంగ్రెస్ కూడా..

'వ్యూహం' సినిమాలో సోనియా గాంధీ, రోశయ్య పాత్రలు కూడా ఉన్నట్టు ట్రైలర్ లో తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా సినిమా ప్రదర్శన విషయంలో అడ్డుపడుతున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై కూడా విచారణ జరగాల్సి ఉంది. ఈ దశలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో 'వ్యూహం' ఆగిపోవడం విశేషం.

First Published:  29 Dec 2023 10:47 AM IST
Next Story