Telugu Global
Andhra Pradesh

ఏ పార్టీ డోర్లు తెరవడం లేదా? ఇండిపెండెంట్‌గానే లక్షీనారాయణ పోటీ!

విశాఖ కేంద్రంగానే లక్ష్మీనారాయణ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఏ పార్టీ డోర్లు తెరవడం లేదా? ఇండిపెండెంట్‌గానే లక్షీనారాయణ పోటీ!
X

ఏపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాక ముందు.. ఆయన అక్రమాస్తుల కేసు విచారణ సమయంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ చాలా ఫేమస్ అయ్యారు. ఆ కేసు విషయంలో ఇతర పార్టీల నాయకులకు లీకులు ఇస్తూ.. చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కేసు ద్వారానే సామాన్యులకు కూడా తెలిసిన లక్ష్మీనారాయణ.. ఆ పాపులారిటీని ఉపయోగించుకొని రాజకీయాల్లో చక్రం తిప్పుదామని డిసైడ్ అయ్యారు. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం జనసేన ద్వారా జరిగింది. మొదట టీడీపీకి వెళ్తారని భావించినా.. పవన్ కల్యాణ్‌తో నడవాలని డిసైడ్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ గాలి బలంగా వీచిన ఆ ఎన్నికల్లో జేడీ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన భరత్ కు 4,32,492 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లతో విజయం సాధించారు. ఇక వీవీ లక్ష్మీనారాయణ 2,88,874 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీకి కూడా రాజీనామా చేసి సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు విశాఖ కేంద్రంగానే లక్ష్మీనారాయణ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. విశాఖ చుట్టు పక్కల కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఏ పార్టీలో చేరడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. వైసీపీలోకి వచ్చే ఛాన్సే లేదు. ఇక జనసేన నుంచి బయటకు వెళ్లే ముందు పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. టీడీపీలోకి జంప్ అయినా విశాఖ టికెట్ దక్కదు. ఇక బీజేపీ మాత్రమే ఒక అవకాశంగా కనపడుతున్నది. కానీ, ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. పైగా, జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరపున విశాఖ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వీవీ లక్ష్మీనారాయణ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

లక్ష్మీనారాయణకు చెందిన స్వచ్ఛంధ సంస్థ కోఆర్డినేటర్ జగన్ మురారి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాటంటే.. స్వయంగా వీవీ లక్ష్మీనారాయణ చెప్పినట్లే. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయడం కంటే స్వతంత్రంగా పోటీ చేస్తేనే తనకు విలువ ఉంటుందని వీవీ భావించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో.. వారందరినీ మించి ప్రచారం చేసి, గెలవగలరా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరకపోవడమే మంచిదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి జేడీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

First Published:  25 Dec 2022 8:28 AM IST
Next Story