Telugu Global
Andhra Pradesh

ఓట్ ఫ్రమ్ హోమ్.. ఆసక్తి లేదన్న ఏపీ ఓటర్

ఏపీలో కేవలం 28,591మంది మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసేందుకు సమ్మతి తెలిపారు. అంటే అవకాశం ఉన్నా కూడా కేవలం 3.9 శాతం మంది మాత్రమే ఇంటి నుంచి ఓటు వేస్తున్నారనమాట.

ఓట్ ఫ్రమ్ హోమ్.. ఆసక్తి లేదన్న ఏపీ ఓటర్
X

ఏపీలో నేడు తొలి ఓటు పడింది. ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. పోలింగ్ శాతం పెంచడానికి ఇంటినుంచే ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఇటీవల పలు ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్లా సమర్థంగా ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఏపీలో మాత్రమం చాలామంది ఇంటినుంచి ఓటు వేసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేసేందుకే వృద్ధులు, వికలాంగులు కూడా ఆసక్తి చూపించడం విశేషం.

85 ఏళ్లపైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. ఏపీలో ఇలాంటి వాళ్లు మొత్తం 7,28,484 మంది ఉన్నారు. వీరందరికీ ఇంటికెళ్లి మరీ అధికారులు అవగాహన కల్పించారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకున్నవారి వద్ద ఫామ్-12 దరఖాస్తు తీసుకున్నారు. ఇంటివద్ద ఓటు తమకు వద్దు అనే వారి నుంచి కూడా.. తమకు అక్కర్లేదన్నట్టుగా మరో ఫామ్ పై సంతకం తీసుకున్నారు. ఏపీలో కేవలం 28,591మంది మాత్రమే ఇంటి నుంచి ఓటు వేసేందుకు సమ్మతి తెలిపారు. అంటే కేవలం 3.9 శాతం మంది మాత్రమే ఇంటి నుంచి ఓటు వేస్తున్నారనమాట. మిగతా వారంతా ఈనెల 13న పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేస్తామంటున్నారు.

కారణం ఏంటి..?

ఎన్నికలు, పోలింగ్ అంటే యువత పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు కానీ, పల్లెటూళ్లలో ఉండే వృద్ధులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. గ్రామాల్లో తొలి ఓటు వేయడానికి చాలామంది క్యూలైన్లలో నిలబడి మరీ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటివారంతా తమకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉన్నా కూడా వద్దంటున్నారు. పోలింగ్ బూత్ ముందు నిలబడి ఓటు వేస్తామని చెబుతున్నారు. వికలాంగులు కూడా చాలామంది పోలింగ్ బూత్ కి రావడానికే ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తిగా కదలలేనివారు, మంచంలో నుంచి లేవలేని వారు మాత్రమే ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఏపీలో ఈరోజు నుంచి ఓట్ ఫ్రమ్ హోమ్ మొదలైంది.

First Published:  3 May 2024 8:09 AM GMT
Next Story