ఏపీలోనూ ఓట్ ఫ్రం హోమ్..
80 ఏళ్లకు మించి వయసున్న వృద్ధులకు ఓట్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇస్తారు. అలాగే 40 శాతం పైగా వైకల్యమున్న దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తారు.
వయోవృద్ధులు, తీవ్రమైన వైకల్యం ఉన్న దివ్యాంగులు ప్రయాసపడి పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేయడం ప్రతిఎన్నికల్లోనూ చూస్తుంటాం. రాజకీయ పార్టీల నేతలే వారిని ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి ఓట్లేయిస్తుంటారు. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థికే ఓటేయాలని ప్రలోభపెడుతుంటారు కూడా. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ ఫ్రం హోమ్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇలాంటి వారు ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా తీసుకురానుంది. పలు రాష్రాల్లో ఇప్పటికే ఈ పోలింగ్ ఉన్నాఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తొలిసారిగా ఈ అవకాశం కల్పించబోతోంది.
80 ఏళ్లకు మించి వయసున్న వృద్ధులకు ఓట్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇస్తారు. అలాగే 40 శాతం పైగా వైకల్యమున్న దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 5 రోజుల ముందే వీరు ఫాం 12డీ ద్వారా ఓట్ ఫ్రం హోమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవకాశం కల్పిస్తారు. పోలింగ్ రోజు కంటే ముందే అధికారులు ఇంటికి వచ్చి ఈ ఓటర్లతో ఓటేయిస్తారు. రహస్య పద్ధతిలో జరిగే ఈ ఓటింగ్ ప్రక్రియను మొత్తం వీడియో కూడా తీస్తారు.
తెలంగాణలో ఓటేసిన 20 వేల మంది
గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పద్ధతి పాటించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 29వేల మందిని ఓట్ ఫ్రం హోమ్‌కు అర్హులుగా గుర్తించారు. వీరిలో 20 వేల మందికి పైగా ఇంటి నుంచే ఓటేశారు. ఏపీలో ఇందుకు అర్హులైన వారి సంఖ్య భారీగానే ఉండబోతోంది.