మహిళా వాలంటీర్లను గదిలో బంధించారు.. ఎందుకంటే..?
వాలంటీర్లపై అంత అనుమానం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లంతా ఒకచోట చేరితే ఎన్నికలకోసమేనా అని నిలదీశారు.
వాలంటీర్ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు పారితోషికాలు పెంచుతామంటూ టీడీపీ కూటమి చెబుతుంటే.. మరోవైపు వాలంటీర్లపై అదే కూటమికి చెందిన నేతలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. ఆరుగురు వాలంటీర్లను కాకినాడ జనసేన నేతలు ఓ రూమ్ లో బంధించారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరు గర్భిణి కూడా అసలు వారిని ఎందుకు బంధించారు..? వాలంటీర్లు చేసిన తప్పేంటి..? అనే విషయాలు తెలుసుకుంటే మాత్రం జనసేన నేతల్ని ఎవరూ క్షమించరు.
కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రమణయ్యపేటలో మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో ఆరుగురు వాలంటీర్లు ఉన్నారనే సమాచారంతో జనసేన నేతలు అక్కడికి వెళ్లారు. వాస్తవానికి వారంతా అక్కడ బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు. తమలో ఒకరి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్వీట్స్, కూల్ డ్రింక్స్ వారి వద్ద ఉన్నాయి. అయితే జనసేన నేతలు మాత్రం వారు డబ్బులు పంచుతున్నారంటూ అభాండాలు వేశారు. అక్కడితో ఆగకుండా అదే ఫైనాన్స్ కంపెనీ రూమ్ లో వారిని బంధించారు. రెండు గంటలసేపు ఆ రూమ్ లోనే వారిని ఉంచి హంగామా చేశారు. తలుపు తీయమని ఎంత వేడుకున్నా జనసేన నేతలు కనికరించలేదు. లోపల గర్భిణి ఉందని చెప్పినా పట్టించుకోలేదు. భయాందోళనలతో ఇద్దరు వాలంటీర్లు సొమ్మసిల్లి పడిపోవడంతో చివరకు వారు తలుపు తీశారు.
వాలంటీర్లపై అంత అనుమానం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లంతా ఒకచోట చేరితే ఎన్నికలకోసమేనా అని నిలదీశారు. జనసేన నేతల అమానుష ప్రవర్తనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వాలంటీర్లను బంధించిన ఘటనలో కూటమి నేతలపై విమర్శలు వెల్లువెత్తాయి.