వాలంటీర్ వ్యవస్థపై సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?
వాలంటీర్ సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ సినిమాను విడుదల చేసి తీరుతామని చెప్పారు నిర్మాత.
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లను విధులకు దూరం చేయడం దగ్గర్నుంచి పారితోషికం రూ.10వేలు చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం, వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు.. ఇలా ప్రతిరోజూ వారు వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. తాజాగా వాలంటీర్లపై రూపొందుతున్న సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. వాలంటీర్ వ్యవస్థపై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విడుదల చేయడం విశేషం.
ఈ సినిమాలో సూర్య కిరణ్ హీరోగా నటిస్తున్నారు. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తుండగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ వాలంటీర్ సినిమాని నిర్మిస్తున్నారు. తిరుపతిలో జరిగిన టైటిల్ లాంచ్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామితోపాటు ఇతర వైసీపీ నేతలు హాజరయ్యారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారని, ప్రధాని మోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారని చెప్పారు నారాయణ స్వామి. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారని చెప్పారాయన. వాలంటీర్ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
వాలంటీర్ సేవలను.. వారి చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలిపారు నిర్మాత. వాలంటీర్లు రియల్ హీరోలని ఆయన కొనియాడారు. ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ సినిమాను విడుదల చేసి తీరుతామని చెప్పారాయన. అయితే ఎన్నికలకు ముందే సినిమా విడుదల చేస్తారా, లేక ఎన్నికల తర్వాత వాలంటీర్ మూవీ థియేటర్లలోకి వస్తుందా అనేది తేలాల్సి ఉంది.