వైజాగ్ స్టీల్ విషయంలో బీఆర్ఎస్ పై వైసీపీ సెటైర్లు.. అసలు నిజమేంటి..?
విశాఖ స్టీల్ ప్లాంటు బిడ్డింగ్ లో పాల్గొనకుండా సింగరేణికి నిబంధనలే అడ్డుగా నిలిచాయి. అయితే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ చొరవను అపహాస్యం చేసేలా వార్తల్ని పుట్టిస్తోంది.
విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రతిపాదించిన ఆసక్తి వ్యక్తీకరణ (EOI)ప్రక్రియ గడువు ముగిసే సమయానికి మొత్తం 29 బిడ్లు దాఖలయ్యాయి. అనూహ్యంగా ఇందులో తెలంగాణ ప్రభుత్వం కానీ, సింగరేణి కానీ లేవు. కేవలం తెలంగాణ ప్రభుత్వం కోసమే ఐదురోజులపాటు బిడ్డింగ్ గడువు పొడిగించినా, వెనకడుగు వేసిందని వైసీపీ నుంచి విమర్శలు వినపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కి నిర్వహణ మూలధనం సమకూర్చడం తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉండటంతోనే వెనకడుగు వేశారని సాక్షి మీడియాలో హైలెట్ చేశారు. వెనక్కు తగ్గిన తెలంగాణ ప్రభుత్వం అంటూ కథనాలిచ్చారు.
వెనక్కి తగ్గినట్టేనా..?
వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేసింది. సింగరేణి నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి వైజాగ్ ప్లాంట్ పరిస్థితిపై అధ్యయనం చేయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తెలంగాణకు, సింగరేణికి అడ్డంకిగా మారాయి. ప్రభుత్వరంగ సంస్థల విక్రయం కోసం కోరే టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలుగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలున్న సంస్థలుగానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కో-ఆపరేటివ్ సొసైటీలుగానీ పాల్గొనకుండా కేంద్రం నిబంధనలు తీసుకొచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నిబంధన అడ్డంకిగా మారింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేయలేకపోయింది.
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ సర్కారు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. అమ్మాలనుకుంటున్న సంస్థను మరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా, ప్రభుత్వాలుగానీ, ప్రభుత్వాల పరిధిలోని సహకార సంస్థలుగానీ దక్కించుకోకుండా నిబంధనలు రూపొందించింది. అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీచేసింది. విశాఖ స్టీల్ ప్లాంటు బిడ్డింగ్ లో పాల్గొనకుండా సింగరేణికి ఈ నిబంధనలే అడ్డుగా నిలిచాయి. అయితే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ చొరవను అపహాస్యం చేసేలా వార్తల్ని పుట్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ సాక్షి, రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేస్తోంది. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో వైసీపీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ చిత్తశుద్ధితో ఉంది.