Telugu Global
Andhra Pradesh

శారదా పీఠం.. చంద్రబాబు, జగన్ లా కాదా..?

విశాఖ శారదాపీఠం వ్యవహారంలో చంద్రబాబు సానుకూలంగా ఉండి ఉంటే.. టీడీపీ అనుకూల మీడియా కూడా స్వరూపానందకు బాకాలూదేది. కానీ ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది.

శారదా పీఠం.. చంద్రబాబు, జగన్ లా కాదా..?
X

చంద్రబాబు హయాంలో కొంతమంది మాట బాగా చెల్లుబాటయ్యేది, జగన్ హయాంలో ఆయన ప్రయారిటీలు వేరుగా ఉండేవి. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు తమ మాట నెగ్గించుకున్నవారిలో కొందరు బాబు ప్రభుత్వంలో కూడా అలాగే తమ హవా కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వారిని చంద్రబాబు తన దగ్గరకు రానిస్తారా, అలాంటి ప్రాధాన్యతే ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

జగన్ పాలనలో విశాఖ శారదా పీఠం ప్రాముఖ్యత ఎలా ఉండేదో అందరికీ తెలుసు. జగన్ దృష్టిలో పడాలనుకునేవారు కొందరు ముందుగా శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతిని ప్రసన్నం చేసుకునేవారు. అలాంటి వారందరూ నిజంగానే ప్రయోజనం పొందారా లేదా అనేది తెలియదు కానీ, ఆ హవా అలా కొనసాగేది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత స్వరూపానంద వెంటనే ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబుకి జై కొట్టారు. తాను చేసిన రాజశ్యామల యాగం ఫలితంగానే జగన్ సీఎం అయ్యారని చెప్పుకునే స్వామి, ఇప్పుడు టీడీపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించడంలేదు.

విశాఖ శారదాపీఠం వ్యవహారంలో చంద్రబాబు సానుకూలంగా ఉండి ఉంటే.. టీడీపీ అనుకూల మీడియా కూడా స్వరూపానందకు బాకాలూదేది. కానీ ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది. శారదా పీఠం, సెక్యూరిటీ విషయంలో ఎల్లో మీడియా వ్యతిరేక కథనాలిస్తోంది. ఐదేళ్ల కాలంలో రూ. 12 కోట్ల నుంచి రూ.15కోట్ల వరకు శారదా పీఠం కోసం ప్రజా ధనం వృథా అయిందని చెబుతోంది ఎల్లో మీడియా. భీమిలిలో రూ.200కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కూడా కట్టబెట్టారని ఆరోపిస్తోంది. ఈ కథనాలను పరిశీలిస్తే శారదా పీఠం విషయంలో చంద్రబాబు సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఇక శారదా పీఠానికి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీని తొలగించేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అయినా.. చివరకు అలాంటిదేమీ లేదని తేలింది. ఈ నెల 21న చాతుర్మాస దీక్షకు స్వరూపానంద రుషికేశ్‌ వెళ్తున్నట్లు సమాచారం. ఈలోగా శారదా పీఠం భద్రత, తదితర విషయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

First Published:  20 Jun 2024 4:57 AM IST
Next Story