Telugu Global
Andhra Pradesh

విశాఖ డ్రగ్స్ విషయంలో సీబీఐకి వైసీపీ లేఖ

విశాఖ కంటైనర్ డ్రగ్స్‌ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. వారు తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.

విశాఖ డ్రగ్స్ విషయంలో సీబీఐకి వైసీపీ లేఖ
X

విశాఖ పోర్ట్ లో 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడిన విషయంలో.. నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి వైసీపీ తరపున లేఖ రాస్తామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల కమిషన్‌ కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని తాము కోరుతున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు సజ్జల. విశాఖ డ్రగ్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

విశాఖ కంటైనర్ డ్రగ్స్‌ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. అయితే వారు తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. పురందేశ్వరి బంధువులకు డ్రగ్స్ తెప్పించిన ఆక్వా కంపెనీతో సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే టీడీపీ డైవర్షన్ గేమ్ మొదలు పెట్టిందని, కావాలనే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని చెప్పారు సజ్జల. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడులు చేశారని, తమ ప్రభుత్వం వచ్చాకే పెద్ద ఎత్తున నిల్వలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని చెప్పారు.

మరోవైపు విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో పోలీస్ శాఖపై వచ్చిన ఆరోపణల విషయంలో విశాఖ సీపీ రవిశంకర్‌ స్పందించారు. ఇంటర్‌పోల్‌ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లారని, తమపై ఎలాంటి పొలిటికల్‌ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదని, తాము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నామని వివరించారు. ఏపీ పోలీసులపై సీబీఐ కూడా ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారని సీపీ రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని ఆయన హితవు పలికారు.

First Published:  22 March 2024 2:50 PM IST
Next Story