Telugu Global
Andhra Pradesh

బెట్టు వీడని జీవీఎల్.. లోకేష్ తోడల్లుడికి కష్టకాలం

కూటమి అభ్యర్థి భరత్ ప్రచారం చప్పగా సాగుతోంది. జనసేన నేతలు వెంట వెళ్తున్నా, బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. జీవీఎల్ ఇప్పటి వరకు భరత్ ని కలవలేదు.

బెట్టు వీడని జీవీఎల్.. లోకేష్ తోడల్లుడికి కష్టకాలం
X

కూటమిలో విశాఖ ఎంపీ సీటు చిచ్చు పెట్టింది. ఎప్పట్నుంచో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఇంకా తన ప్రయత్నాలను ఆపలేదు. ఆల్రడీ ఆ సీటుని నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కి టీడీపీ కేటాయించింది. ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ జీవీఎల్ మాత్రం ఆ సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. బీజేపీ పెద్దల దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టారు.

జీవీఎల్ కి విశాఖ ఎంపీ సీటు కేటాయించాలంటూ కొన్నాళ్లుగా జనజాగరణ సమితి పేరుతో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఇక ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో విశాఖలో సమావేశమైన జీవీఎల్, వారిని పార్టీ పెద్దల వద్దకు రాయబారం పంపారు. వ్యాపార వర్గం ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. జీవీఎల్ కి ఆ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు తనకు పరిచయం ఉన్న సీనియర్ల ద్వారా కూడా జీవీఎల్ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కూటమి అభ్యర్థి భరత్ ప్రచారం చప్పగా సాగుతోంది. జనసేన నేతలు వెంట వెళ్తున్నా, బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. జీవీఎల్ ఇప్పటి వరకు భరత్ ని కలవలేదు. తనకు సీటు రాకపోవడానికి కారణం చంద్రబాబు, పురంధేశ్వరి అని ఆయన బలంగా నమ్ముతున్నారు. వారిపై కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేయిస్తున్నారు జీవీఎల్.

2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నగరానికి సంబంధించి 4 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకుంది, విచిత్రంగా విశాఖ ఎంపీ సీటు మాత్రం ఓడిపోయింది. అప్పట్లో తన కొడుకు లోకేష్ కి అడ్డు రావొచ్చనే అనుమానంతోనే చంద్రబాబు క్రాస్ ఓటింగ్ వ్యూహంతో భరత్ ని ఓడించారనే ప్రచారం కూడా ఉంది. ఈ ఐదేళ్లలో భరత్ కంటే లోకేషే బెటర్ అని చంద్రబాబు భావించారు. అందుకే ఈసారి భరత్ టికెట్ విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. చంద్రబాబు కరుణించినా, జీవీఎల్ బెట్టు వీడకపోవడంతో శ్రీభరత్ ఇబ్బంది పడుతున్నారు.

First Published:  16 April 2024 9:53 AM IST
Next Story