Telugu Global
Andhra Pradesh

హార్బర్ అగ్ని ప్రమాదం.. 48 గంటల్లోనే పరిహారం

పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు.. 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000 చెల్లించారు. పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించారు.

హార్బర్ అగ్ని ప్రమాదం.. 48గంటల్లోనే పరిహారం
X

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగి 48గంటలు గడవకముందే బాధితులకు పరిహారం చెల్లించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం రూ. 7.11కోట్ల నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో బాధితులకు అందించారు నేతలు, అధికారులు. మొత్తం 49మంది బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు నేతలు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించారు. బాధిత మత్స్యకారులకు నష్టంలో 80శాతం పరిహా­రం ఇస్తామని అదేరోజు ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడి 48గంటలు గడవకముందే.. జిల్లా కలెక్టర్‌ అకౌంట్‌ కు పరిహారం డబ్బులను సీఎం కార్యాల­యం జమ చేసింది. వాటిని ఈ రోజు చెక్కుల రూపంలో బాధితులకు అందించారు.

పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు.. 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000 చెల్లించారు. పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించారు. బోట్లు దగ్ధమవడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులకు కూడా ఇబ్బంది ఏర్పడింది. ఆ ఇబ్బందిని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ కింద రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బాధితులకు వ్యక్తిగత సాయం ప్రకటించారు. ఒక్కొకరికి రూ.50వేలు సాయం అందిస్తామని చెప్పిన పవన్ మరికొన్ని రోజుల్లో వారిని స్వయంగా కలసి ఆ సాయాన్ని ఇస్తానన్నారు.


First Published:  23 Nov 2023 1:49 PM IST
Next Story