Telugu Global
Andhra Pradesh

జగన్ బ్రాండ్ అయితే నాలుగేళ్లు ఏం చేశారు..?

టీడీపీ హయాంలో ప్రముఖ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటే, వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందన్నారు. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు.

జగన్ బ్రాండ్ అయితే నాలుగేళ్లు ఏం చేశారు..?
X

విశాఖలో జగన్ బ్రాండ్ అనేది బాగా హైలెట్ అయింది. వైసీపీ నేతలు కూడా జగన్ అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జోష్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే నాలుగేళ్లు ఆ బ్రాండ్ ఏం చేసింది, ఎటు పోయింది అంటూ లాజిక్ తీస్తున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జగన్ నిజంగానే పెద్ద బ్రాండ్ అయితే దాదాపు నాలుగేళ్ల వైసీపీ పాలనలో పెట్టుబడులు ఎందుకు ఏపీకి తరలి రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే విశాఖలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో హడావిడి ఏంటని విమర్శించారాయన.

గ్లోబల్ సమ్మిట్ కి ముందు గంటా శ్రీనివాసరావు ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అందులో 20ప్రశ్నలు సంధించారు. వాటికి ఇంకా ప్రభుత్వం జవాబు చెప్పలేదంటున్నారు గంటా. గంటా గాలివాటంగా మాట్లాడితే తామెందుకు సమాధానం చెబుతామంటున్నారు వైసీపీ నేతలు. గంటా నాలుగేళ్లు పడుకుని ఇప్పుడే నిద్ర లేచారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద గ్లోబల్ సమ్మిట్ తో లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామంటోంది వైసీపీ ప్రభుత్వం. అవి అసలు గ్రౌండింగ్ అయితేనే కదా ఫలితం అంటున్నారు టీడీపీ నేతలు.

ఎంవోయూలను వాస్తవ రూపంలో తీసుకుని రావడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలు ఛాలెంజ్ అన్నారు గంటా. టీడీపీ హయాంలో సమ్మిట్ జరిగినప్పుడు డైవర్ట్ చేసేందుకు జగన్, వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా చేసిన ప్రయత్నాలు ప్రజలకు గుర్తున్నాయన్నారు. నాలుగేళ్లు పారిశ్రామిక అభివృద్ధిని వదిలేసి ఎన్నికల ముందు హడావిడి చెయ్యడం ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగమే అని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ప్రముఖ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందన్నారు. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఒప్పందాలు చేసుకోవడంలో చూపించిన చొరవ పరిశ్రమలను రాబట్టడంలో ప్రదర్శిస్తే స్వాగతిస్తామని చురకలంటించారు.

First Published:  4 March 2023 9:07 PM IST
Next Story