Telugu Global
Andhra Pradesh

మళ్లీ తెరపైకి విశాఖ.. కోటి రూపాయల డీల్, లేడీ సీఐ అరెస్ట్

90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే, కోటి రూపాయల విలువైన 2వేల రూపాయల నోట్లు ఇస్తారు. 10లక్షలు లాభం. ఇదీ డీల్.

మళ్లీ తెరపైకి విశాఖ.. కోటి రూపాయల డీల్, లేడీ సీఐ అరెస్ట్
X

ఏపీకి కాబోయే రాజధాని విశాఖను ప్రశాంత నగరంగా ప్రొజెక్ట్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం విశాఖను కార్నర్ చేస్తున్నాయి. వైరి వర్గాలు విశాఖపై క్రైమ క్యాపిటల్ అనే ముద్ర వేస్తున్నాయి. ఇటీవల వరుస కిడ్నాప్ ఉదంతాల తర్వాత తాజాగా కోటిరూపాయల డీల్ విశాఖలో బట్టబయలైంది. ఈ డీల్ లో మోసం చేసింది సాక్షాత్తూ ఓ మహిళా పోలీస్ అధికారి కావడం మరీ విశేషం. మహిళా సీఐ స్వర్ణ లత సహా మరో ఇద్దరు హోం గార్డ్ లను పోలీసులు అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామం.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల ప్రభుత్వం 2వేల నోట్లను చలామణి నుంచి తొలగించడంతో డెడ్ లైన్ ముగిసేలోగా వాటిని మార్చుకోడానికి అందరూ హడావిడి పడుతున్నారు. కొంతమంది బడాబాబులు 2వేల నోట్లు మార్చుకోడానికి ఇబ్బంది పడుతున్నారని, వారికి 500 రూపాయల నోట్లు ఇస్తే లక్షల్లో లాభం సంపాదించొచ్చని మాయమాటలు చెబుతూ ఓ ముఠా రంగంలోకి దిగింది. ఈ ముఠా మాయమాటలకు బోల్తా పడిన మాజీ నావల్ ఆఫీసర్లు 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు.

90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే, కోటి రూపాయల విలువైన 2వేల రూపాయల నోట్లు ఇస్తారు. 10లక్షలు లాభం. ఇదీ డీల్. మాజీ నావల్ ఆఫీసర్లు 90 లక్షల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలతో బయలుదేరారు. డీల్ సెట్ చేస్తామంటూ వచ్చిన మధ్యవర్తి సూరిబాబు వీరిని మోసం చేశాడు. మధ్యలో పోలీసుల ఎంట్రీతో మాజీ నావల్ ఆఫీసర్లు కొల్లి శ్రీను, శ్రీధర్ లకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో సీఐ స్వర్ణలతకు కూడా భాగం కావాలంటూ వారు డిమాండ్ చేయడంతో వ్యవహారమంతా గందరగోళంగా మారింది. ఐటీ వాళ్లు వస్తే మొదటికే మోసం వస్తుందంటూ భయపెట్టి పోలీసులు 12 లక్షలు కాజేశారు. మొత్తమ్మీద పోలీసులు 12లక్షలు కాజేసి వారిని పంపించేశారు. బాధితులు భయపడి వెళ్లిపోయినా తర్వాతి రోజు డీసీపీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎట్టకేలకు సీఐ స్వర్ణలత సహా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2వేల రూపాయల మార్పిడి పేరుతో మోసం చేసేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

First Published:  7 July 2023 10:48 AM GMT
Next Story