Telugu Global
Andhra Pradesh

మీరు పట్టింపులకు వెళ్తున్నట్టుగా ఉంది.. - సుప్రీంకోర్టు

మీ తీరు చూస్తుంటే.. ఈగోలకు, పట్టింపులకు వెళ్తున్నట్టుగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలన్న పట్టింపున‌కు వెళ్తున్నట్టుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

మీరు పట్టింపులకు వెళ్తున్నట్టుగా ఉంది.. - సుప్రీంకోర్టు
X

మీరు పట్టింపులకు వెళ్తున్నట్టుగా ఉంది.. - సుప్రీంకోర్టు

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ సునీతా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్బంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.


ఆమె తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సిద్దమవగా.. తాము వెకేషన్‌ బెంచ్‌ ముందు జూనియర్ కౌన్సిల్స్ వాదనలు మాత్రమే వింటామని సీనియర్ కౌన్సిల్స్‌ వాదనలు వినిపించవద్దని కోర్టు తెలిపింది. అప్పటికప్పుడు జూనియర్ కౌన్సిల్స్ సిద్ధంగా లేకపోవడంతో సునీతారెడ్డే నేరుగా వాదనలు వినిపించారు.

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తున‌కు ఆటంకం కలుగుతోందన్నారు. ఇతర నిందితులతో కలిసి అవినాష్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, ఇందుకు ఏపీలోని అధికార పార్టీ సహకరిస్తోందన్నారు. వివేకా మరణం గురించి అందరి కంటే ముందుగానే జగన్‌కు తెలుసన్న విషయాన్ని ఇటీవల సీబీఐ కూడా బయటపెట్టిందని గుర్తుచేశారు.


జగన్‌ కూడా అవినాష్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చారని.. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి బయట ఉంటే దర్యాప్తు సరిగా సాగదన్నారు. కాబట్టి బెయిల్ రద్దు చేయాలని కోరారు. రేపే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీబీఐ హాజరయ్యేలా నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు.

ఇందుకు కోర్టు నిరాకరించింది. హాజరుకావాలా.. వద్దా.. అన్నది సీబీఐ ఇష్టమంది కోర్టు. మీ తీరు చూస్తుంటే.. ఈగోలకు, పట్టింపులకు వెళ్తున్నట్టుగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలన్న పట్టింపున‌కు వెళ్తున్నట్టుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.


దర్యాప్తు సమయంలో ఎవరిని ఎలా విచారించాలి, ఎప్పుడు విచారించాలి అన్నది సీబీఐ ఇష్టమని కోర్టు కామెంట్ చేసింది. విచారణకు సహకరిస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్‌ రద్దు చేసి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

First Published:  13 Jun 2023 8:03 AM GMT
Next Story