Telugu Global
Andhra Pradesh

వివేకా కేసులో కీలక మలుపు.. విచారణాధికారి రామ్ సింగ్ పై వేటు

రామ్ సింగ్ ని కేసు విచారణ నుంచి సీబీఐ తప్పించింది. ఆయన స్థానంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ కి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.

వివేకా కేసులో కీలక మలుపు.. విచారణాధికారి రామ్ సింగ్ పై వేటు
X

వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌ సింగ్‌ ను సీబీఐ తప్పించింది. విచారణ కోసం కేఆర్ చౌరాసియా నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. ఈమేరకు సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియాతోపాటు ఈ సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముకేష్ కుమార్‌.. మరో ముగ్గురు అధికారులు ఉంటారు.

ఎందుకీ మార్పు..?

వివేకా హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్‌ రెడ్డి సతీమణి తులశమ్మ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించింది. కేసు కంటిన్యుటీ దెబ్బతింటుందని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలపగా.. కొత్త అధికారిని అదనంగా నియమించుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ సీబీఐకి ఉందన్నది. దీంతో సీబీఐ కొత్త టీమ్ ఏర్పాటు చేసింది. రామ్ సింగ్ ని కేసు విచారణ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ కి సుప్రీం ఆమోదం తెలిపింది.

ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు పూర్తవ్వాలి..

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఆలస్యమవుతోందని, అందుకే కాలపరిమితిని విధిస్తున్నామని తెలిపింది. ఏప్రిల్‌ 30లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని నిర్దేశించింది. సీబీఐ కూడా దీనికి అంగీకరించింది.

బెయిల్ కుదరదు..

కేసు విచారణ ఆలస్యమవుతుందని, నిందితుడు శివశంకర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య తులశమ్మ వేసిన బెయిల్ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం.. 6నెలల్లోపు ట్రయల్‌ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్‌ వేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌ పై నిర్ణయం ఉంటుందని తెలిపింది.

First Published:  29 March 2023 4:46 PM IST
Next Story