Telugu Global
Andhra Pradesh

రాజధాని ముద్ర పడిపోయినట్లేనా?

జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో ఇప్పుడు ఎవరు కూడా దీన్ని కాదనలేని పరిస్థితి వచ్చేసింది. కేంద్రమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల రాకతో రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన సందడి, మాట్లాడిన మాటల కారణంగా విశాఖకు రాజధాని స్టేటస్ వచ్చేసింది.

రాజధాని ముద్ర పడిపోయినట్లేనా?
X

సుప్రీంకోర్టులో కేసు విచారణ, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాలో వ్యతిరేకత ఎలాగున్నా విశాఖపట్నంకు రాజధానిగా ముద్రపడిపోయిందనే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో ఇప్పుడు ఎవరు కూడా దీన్ని కాదనలేని పరిస్థితి వచ్చేసింది. కేంద్రమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల రాకతో రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన సందడి, మాట్లాడిన మాటల కారణంగా విశాఖకు రాజధాని స్టేటస్ వచ్చేసింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలోని కొందరు, టీడీపీ నేతలు వేసిన కేసుల కారణంగా కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా మూకుమ్మడిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కోర్టులో కేసు విచారణను స్పీడు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ముందే కోర్టు తీర్పు రావాలని జగన్ ఆశించినా సాధ్యంకాలేదు. అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.

అంతర్జాతీయ సదస్సులకు విశాఖ సరైన వేదిక అని అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్ కూడా పెట్టుబడుల సదస్సును విశాఖలో నిర్వహించారు. దాంతో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలు వైజాగ్‌లో రెండు రోజులు సందడి చేశారు. ఇదే సమయంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, శర్వానంద్ సోనోవాల్ కూడా హాజరయ్యారు. వీళ్ళ ప్రసంగాల్లో విశాఖే రాజధాని అన్నట్లు మాట్లాడారు. కిషన్ అయితే విశాఖ రాజధాని అని డైరెక్టుగానే చెప్పేశారు. రోడ్డు కనెక్టివిటీకి రూ.6500 కోట్లు ఇస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. విశాఖ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.

విశాఖ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సోనోవాల్ ప్రకటించారు. అంటే కేంద్రమంత్రులు కూడా విశాఖను రాజధానిగానే భావించినట్లు చెప్పాలి. ఇక పారిశ్రామికవేత్తలంతా జగన్ ఆలోచనలకే మద్దతుగా మాట్లాడారు. జరిగింది చూస్తుంటే ప్రముఖులందరిచేత విశాఖపట్నంకు రాజధానిగా జగన్ ముద్ర వేయించేసినట్లు అర్థ‌మవుతోంది. కోర్టు కేసు, తీర్పుతో సంబంధం లేకుండా తాను తొందరలోనే విశాఖకు మారబోతున్నట్లు జగన్ చెప్పేశారు. కాబట్టి విశాఖపై రాజధాని ముద్రపడిపోయినట్లే అనుకోవాలి.

First Published:  5 March 2023 10:08 AM IST
Next Story