Telugu Global
Andhra Pradesh

జగన్ @ ఏయూ క్యాంపస్..?

అందుకనే నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ ను ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏయూని ఎంపిక చేసుకోవటంలో మూడు ప్రధాన కారణాలున్నాయి.

జగన్ @ ఏయూ క్యాంపస్..?
X

మూడు రాజధానుల ప్రతిపాదనకు కార్యరూపం ఇవ్వటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తొందరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్‌ అవ్వబోతున్నట్లు సమాచారం. అత్యవసరంగా క్యాంపు ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుని వారంలో కనీసం మూడురోజులు విశాఖలోనే ఉండాల‌ని నిర్ణయించారట. ఇందులో భాగంగానే క్యాంప్ ఆఫీసు ఏర్పాటు కూడా జరిగిపోతోందని సమాచారం. మొదట్లో కాపులుప్పాడ ప్రాంతంలో భారీ భవనాలను తీసుకుని అవసరానికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకున్నారు. అయితే అందుకు డబ్బులు ఖర్చుచేయటం దండగని జగన్ అనుకున్నారట.

అందుకనే నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ ను ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏయూని ఎంపిక చేసుకోవటంలో మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది విశాలమైన ప్రాంగణం కావటంతో వెహికల్ పార్కింగ్ సమస్యుండదు. అలాగే రెండు భారీ భవనాలున్నాయి. వీటిల్లో సీఎం కార్యాలయం, క్యాంపాఫీసుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. మూడో కారణం అవసర్థం వచ్చే అతిథులకు బస సౌకర్యం ఏర్పాట్లకు యూనివర్సిటీ గెస్ట్ హౌస్ బాగా సరిపోతుందట.

ఈ కారణాల కారణంగానే యూనివర్సిటీలో క్యాంపాఫీసు ఏర్పాటుకు జగన్ మొగ్గుచూపినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు సమాచారం అందగానే ప్లాటినం జూబ్లీగెస్ట్ హౌస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనాలను ప్రభుత్వానికి కేటాయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయిస్తున్నారట. ఉమెన్స్ స్టడీ సెంటర్, ఎడ్యుకేషన్, సంస్కృత విభాగాన్ని ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మార్చేశారట. అకౌంట్స్, కంప్యూటర్ విభాగాలను ఒకే బిల్డింగ్ లోకి తీసుకొచ్చారట. ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ విభాగాన్ని ఖాళీచేసి అందులోని ఉద్యోగులను, యంత్రాలను వేరే బిల్డింగులోకి మార్చేశారు.

గెస్ట్ హౌస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్లింగులే కాకుండా అవసరమైతే వాడుకోవటానికి వీలుగా మరో రెండు పెద్ద భవనాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. కొద్దిరోజుల క్రితమే వైఎస్ భారతి యూనివర్సిటిలోని బిల్డింగులన్నింటినీ చూసెళ్లారట. బహుశా వాస్తు ప్రకారం అవసరమైన మార్పులు చేయటం కోసమే వచ్చి చూసుంటారని యూనివర్సిటీ వర్గాలకు ఇప్పుడు అర్థ‌మైంది. సో.. యూనివర్సిటీలో చకచకా జరిగిపోతున్న పరిణామాలను గమనించిన తర్వాత నవంబర్లో విశాఖకు సీఎం షిఫ్టయిపోవటం ఖాయమనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల్లో మూడురాజధానుల విషయంలో నమ్మకం కలిగించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

First Published:  18 Oct 2022 11:50 AM IST
Next Story