వడివడిగా రాజధాని కోసం అడుగులు.. అక్టోబర్ 16 'విశాఖ వందనం'
‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అన్నీ సమకూర్చుకున్న తర్వాతే విజయదశమిని సీఎం జగన్ పాలనా ముహూర్తంగా ఖరారు చేశారని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.

దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరుగుతుందని సీఎం జగన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. ఆ దిశగా కార్యాచరణ ఊపందుకుంది. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అన్నీ సమకూర్చుకున్న తర్వాతే విజయదశమిని సీఎం జగన్ పాలనా ముహూర్తంగా ఖరారు చేశారని చెప్పారు.
విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలసి ఆయన పాల్గొన్నారు. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతామన్నారు. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేశామని చెప్పారు.
కార్యాలయాల ఎంపిక..
పాలనా రాజధాని విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా విశాఖలో అధికారులతో కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై చర్చించారు. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని తెలిపారు జవహర్ రెడ్డి. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామం అన్నారు. విజయదశమి నుంచి పాలనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. తరచూ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పురోగతి ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని అన్నారు జహహర్ రెడ్డి.