Telugu Global
Andhra Pradesh

వైసీపీ గెలుపు కోసం హర్యానాలో చండీయాగం..? ఎంతవరకు నిజం..?

విశాఖ శారదా పీఠం ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని అన్నారు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. తామెరికీ వత్తాసు పలకడం లేదన్నారు.

వైసీపీ గెలుపు కోసం హర్యానాలో చండీయాగం..? ఎంతవరకు నిజం..?
X

విశాఖ శారదా పీఠం, వైసీపీ మధ్య అవినాభావ సంబంధం ఉందనే ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. శారదా పీఠానికి అన్ని పార్టీల నాయకులు వెళ్తున్నా కూడా.. వైసీపీకి చెందినవారి తాకిడి మాత్రం చాలా ఎక్కువ.


ఏపీలో మంత్రి వర్గ విస్తరణ అంటే చాలు, కొంతమంది ఆశావహులు తాడేపల్లికంటే ఎక్కువగా శారదా పీఠాన్ని సందర్శిస్తారనే ప్రచారం కూడా ఉంది. దీనికితోడు వైసీపీ కోసం శారదాపీఠం యజ్ఞాలు, యాగాలు కూడా చేస్తుందనే పుకారు కూడా బలంగా వినిపించేది.


ఈ నేపథ్యంలో హర్యానాలో కురుక్షేత్రకు సమీపంలోని షాబాద్‌ లో గుమ్తి ఆశ్రమం ఆధ్వర్యంలో లక్ష చండీ మహాయజ్ఞం చేశారు శారదా పీఠ ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర. ఈ యాగం ఎవరికోసం చేశారు, ఏదైనా రాజకీయ పార్టీ గెలుపుకోసం చేశారా.. అనే పుకార్లు వినిపిస్తున్నవేళ, స్మాత్మానందేంద్ర నేరుగా వాటిపై స్పందించడం విశేషం.

విశాఖ శారదా పీఠం ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని అన్నారు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. తామెరికీ వత్తాసు పలకడం లేదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుమ్తి ఆశ్రమంలో జరిగిన యజ్ఞం ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలను ఆశించి చేసినది కాదని స్పష్టం చేశారు.


తొలి నుంచీ పీఠంపై కొందరు ఉద్దేశపూర్వకమైన ముద్ర వేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో శారదా పీఠం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు తమకు సహకారం అందిస్తుంటారని, అయితే అందులో రాజకీయ నాయకులు ఆశ్రమానికి రావడం మీడియాను ప్రత్యేకంగా ఆకర్షించే అంశం అని చెప్పారు.

గతంలో శారదా పీఠం నిర్వహించిన రాజశ్యామల యాగం వల్ల ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం ఉందని మీడియా ప్రశ్నించగా సూటిగా సమాధానమిచ్చారు స్వాత్మానందేంద్ర సరస్వతి.


ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తామని, తమంతట తాము ఏ పార్టీకి అనుకూలంగా యాగాలు చేయలేదని స్పష్టం చేశారు. ఒక పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలనే ఉద్దేశంతో తామెప్పుడూ యాగాలు చేయలేదన్నారు. లోక కల్యాణం కోసమే శారదా పీఠం ఉందన్నారు. దైవభూమిగా పేరొందిన ఉత్తర భారత్ లో కూడా తమ కార్యకలాపాలు విస్తరించడానికి ఢిల్లీలో శారదా పీఠం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

First Published:  2 March 2023 7:16 AM IST
Next Story