Telugu Global
Andhra Pradesh

చంపాలనే దాడి- సీపీ.. పవన్ ఫ్లోరులోనే నిందితులు

మంత్రులపై దాడికి పురిగొల్పిన వారిని ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారంతా నోవాటెల్‌ హోటల్‌లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అర్ధ‌రాత్రి వెళ్లి బయటకు లాక్కొచ్చారు.

చంపాలనే దాడి- సీపీ.. పవన్ ఫ్లోరులోనే నిందితులు
X

విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై జనసేన శ్రేణుల దాడి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రులను చంపాలన్న ఉద్దేశంతోనే దాడులకు తెగబడ్డారని విశాఖ పోలీస్ కమిషనర్‌ వెల్లడించారు. మంత్రులపై విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద దాడి చేసిన జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అర్ధ‌రాత్రి హైడ్రామా నడిచింది. నోవాటెల్ హోటల్ నుంచి స్టేషన్‌కు తరలించారు. మంత్రులపై దాడి చేసిన వారు పవన్‌ కల్యాణ్‌తో పాటు నోవాటెల్‌ హోటల్‌లో ఉండడం చర్చనీయాంశమైంది.

మంత్రులపై దాడికి పురిగొల్పిన వారిని ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారంతా నోవాటెల్‌ హోటల్‌లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అర్ధ‌రాత్రి వెళ్లి బయటకు లాక్కొచ్చారు. కొందరు అరెస్ట్‌లను ప్రతిఘటించగా భారీగా వచ్చిన పోలీసులు ఎత్తుకెళ్లి వాహనాల్లో వేశారు.

మహిళా మంత్రులు కార్లలో వెళ్తుండగా అరటి తొక్కలను చూపిస్తూ.. వెకిలిచేష్టలతో అనుచితంగా ప్రవర్తించినట్టు వీడియో ఫుటేజ్‌లో వెల్లడైంది. సుందరపు విజయ్ కుమార్, ఎస్‌ఎన్‌ రాజులను అరెస్ట్ చేసినట్టు జనసేన ప్రకటించింది. పవన్ కల్యాణ్ బస చేస్తున్న ఫ్లోరులోకి పోలీసులు వచ్చి.. జనసేన నాయకులను అరెస్ట్ చేశారని ఆ పార్టీ వెల్లడించింది. మహిళా మంత్రులపైకి దాడికి ప్రయత్నించిన వారిలో కొందరు జనసేన మహిళా నాయకురాళ్లు కూడా ఉన్నట్టు గుర్తించారు.

అసలు నిన్నటి పవన్ కల్యాణ్ ర్యాలీకి అనుమతి కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకున్నా ప్రధాన మార్గాల్లో నాలుగు గంటల పాటు ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించారని పోలీసులు చెబుతున్నారు. మంత్రులపై దాడి కేసులో నిందితులపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల‌ విధులకు ఆటంకం కలిగించినందుకూ ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

జనసేన నాయకులను విడుదల చేయకపోతే తానే పోలీస్ స్టేషన్‌కు వస్తానని పవన్ హెచ్చరించారు. ఈనేపథ్యంలో నోవాటెల్ హోటల్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనపై విశాఖ సీపీ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు వద్దకు అనుమతి లేకుండా దాదాపు 300 మంది జనసేన వాళ్లు వచ్చి గుమిగూడారని వివరించారు. మంత్రి రోజాతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను అనుచితపదజాలంతో దూషించారని సీపీ వెల్లడించారు.

రాళ్లు, కర్రలు, ఇనుప వస్తువులతో దాడికి తెగబడ్డారని .. చంపాలన్న ఉద్దేశంతోనే దాడికి దిగారని వివరించారు. పోలీసులపైనా దాడికి దిగారని వెల్లడించారు. వీరు సృష్టించిన అడ్డంకుల కారణంగా సకాలంలో లోపలికి వెళ్లలేక 30 మంది ప్రయాణికులు విమానాలను మిస్ అయ్యారని సీపీ చెప్పారు.

First Published:  16 Oct 2022 8:44 AM IST
Next Story