వైసీపీ ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఝలక్.. ఇంటింటికీ తాళాలే!
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఇలా అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. నేను గ్రామానికి వస్తే.. తాళం వేసి నిరసన తెలిపిన వారు ఇకపై ఎలా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారో చూస్తానని హెచ్చరించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ ప్రభుత్వం గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే స్వయంగా పర్యటిస్తూ లబ్ధిదారులతో మాట్లాడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఎమ్మెల్యే పనితీరుపై మొహంపైనే గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దాంతో కొంత మంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఏదో ఒకటి సర్దిచెప్తూ జారుకుంటుండగా.. మరికొందరు బెదిరింపులకి దిగుతున్నారు. కానీ చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబుకి ఘోర అవమానం ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు.. నిమిషాల్లో ఇళ్లకి తాళాలు వేసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు.
పూతలపట్టు మండలం పేటఅగ్రహారంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాబు ఆ గ్రామానికి వెళ్లారు. కానీ.. ఏ ఇంటికి వెళ్లినా అతనికి తాళాలే దర్శనమిచ్చాయి. దాంతో అధికారులను ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావడాన్ని ఆ గ్రామస్తులు ఇష్టపడలేదట. దాంతో ఎమ్మెల్యే గ్రామం విడిచి వెళ్లే వరకూ మళ్లీ తమ గ్రామంలోకి అడుగుపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో తొలుత గ్రామస్తులకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన అధికారులు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. తన పర్యటనని గ్రామస్తులు బహిష్కరించడాన్ని ఎమ్మెల్యే బాబు తీవ్ర అవమానంగా భావించారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఇలా అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. నేను గ్రామానికి వస్తే.. తాళం వేసి నిరసన తెలిపిన వారు ఇకపై ఎలా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారో చూస్తానని హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కోసం తాను సంకల్పించి వస్తే ఇంతలా అవమానిస్తారా? అంటూ చివర్లో ఎమ్మెల్యే బాబు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత అగ్రహారం పంచాయతీలోని అంబేడ్కర్ కాలనీలో పర్యటించి అక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వెనుదిరిగారు. ఎమ్మెల్యే పర్యటనని బహిష్కరించడం ఇప్పుడు పూతలపట్టు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.