10నుంచి 5గంటల వరకే మా డ్యూటీ.. ఏపీ ప్రభుత్వానికి వీఆర్వోల అల్టిమేట్టం
రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టడానికి సిద్ధమయ్యారు.
రెవెన్యూ వ్యవస్థలో అవినీతి మకిలి ముందుగా చేతికి అంటేది వీఆర్వోలకే. అంతమాత్రాన అందరినీ ఒకేగాటన కట్టలేం. అదే సమయంలో అత్యవసర విధులు, ఆ సర్వేలు, ఈ సర్వేలు, రీసర్వేలు అంటూ.. సవాలక్ష పనులు కూడా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు సీఎం కేసీఆర్. ఏపీలో మాత్రం వీఆర్వోలు కొనసాగుతున్నారు. కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా గ్రేడ్-2 వీఆర్వో పోస్ట్ లను భర్తీ చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో వీఆర్వోలంతా ప్రభుత్వానికి అల్టిమేట్టం ఇచ్చారు. ఇతర విధులతో తమను ఇబ్బంది పెట్టొద్దంటున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకే తమ డ్యూటీ అని తేల్చి చెప్పేశారు.
ఏ రాష్ట్రమయినా, పోలీస్, రెవెన్యూ వ్యవస్థలో డ్యూటీ టైమింగ్స్ ఉన్నా వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. అత్యవసరం అయితే ఆ పని పూర్తయ్యే వరకు డ్యూటీ చేయాల్సిందే. తాజాగా ఏపీలో రీ సర్వే అంటూ ప్రభుత్వం భూముల వివరాలు మళ్లీ సేకరిస్తోంది. దీనికి క్షేత్ర స్థాయిలో వీఆర్వోలపై ఒత్తిడి ఉంది. ఆ తర్వాత రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, తహశీల్దార్లకు కూడా టార్గెట్లు ఉన్నాయి. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహశీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు కారణం రీసర్వే ఒత్తిడేనంటున్నారు. ఆయన ఆత్మహత్య తర్వాత రీసర్వే విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అదే మండలానికి చెందిన ఇద్దరు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. అటు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో పనిచేసే వీఆర్వో గుండెపోటుతో మరణించడం కూడా వారిపై ఉన్న ఒత్తిడికి నిదర్శనం అంటున్నారు ఉద్యోగులు. పనిగంటల విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనంటున్నారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటలవరకు మాత్రమే వీఆర్వోలు పనిచేస్తారని, ఆ తర్వాత సర్వేల పేరుతో ఇతర పనులు చెప్పి ఒత్తిడికి గురి చేయొద్దని వేడుకుంటున్నారు.
రేపటినుంచే ఆందోళన..
రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టడానికి సిద్ధమయ్యారు. భోజన విరామ సమయంలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 100 రోజుల్లో రీసర్వే పూర్తి చేయాలంటూ ప్రభుత్వం టార్గెట్లు విధించడం సరికాదంటున్నారు వీఆర్వోల సంఘం నేతలు. రీసర్వే ప్రక్రియలో వీఆర్వోల చేత ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకూ పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని అన్నారు. సచివాలయాల్లో కనీసం స్టేషనరీ ఇవ్వట్లేదని, ఫీల్డ్ వర్క్ చేసే వీఆర్వోలని కూడా బయోమెట్రిక్ పేరుతో వేధించడం తగదంటున్నారు. పనిగంటల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.