Telugu Global
Andhra Pradesh

టీడీపీ గూండాగిరిపై శిరోముండనంతో నిరసన

తాను మాజీ కార్పొరేటర్‌నని, కో-ఆప్షన్‌ మెంబర్‌నని ఈ సందర్భంగా జగదీష్‌ చెప్పారు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనే తాను ఈ నిరసనకు దిగినట్టు జగదీష్‌ చెప్పారు.

టీడీపీ గూండాగిరిపై శిరోముండనంతో నిరసన
X

విజయవాడలో వైసీపీ దళిత నాయకుడిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గూండాగిరీతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత నేత శిరోముండనం చేయించుకొని నిరసన తెలిపారు. ఈ విషయం ఇప్పుడు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో దళిత నేత నందెపు జగదీష్‌పై విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కక్షసాధింపు చర్యలకు దిగారు. నందెపు జగదీష్‌కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. అతని వ్యాపార కట్టడాలను నేలమట్టం చేశారు. అధికారులను ఉపయోగించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన జగదీష్‌.. కూల్చేసిన భవనం ముందే సోమవారం నాడు శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్‌ మీడియాతో మాట్లాడారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాననే అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారని ఆయన విమర్శించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. దళిత వైసీపీ నాయకుడిగా ఉండటం తాను చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. బొండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

తాను మాజీ కార్పొరేటర్‌నని, కో-ఆప్షన్‌ మెంబర్‌నని ఈ సందర్భంగా జగదీష్‌ చెప్పారు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనే తాను ఈ నిరసనకు దిగినట్టు జగదీష్‌ చెప్పారు. అంతేకాదు.. తనకు న్యాయం జరగకపోతే, తన కుటుంబ సభ్యులంతా కలసి శిరోముండనం చేయించుకొని నిరసన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. తాను టీడీపీలో ఉన్న సమయంలో తన భవనాన్ని ప్రారంభించింది బొండా ఉమానేనని ఆయన చెప్పారు. అప్పుడు కనిపించని అక్రమాలు ఇప్పుడెలా కనిపించాయని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి కక్షసాధింపు రాజకీయాలు చూడలేదని, వాటికి బొండా ఉమానే తెరతీశారని ఆయన విమర్శించారు.

First Published:  18 Jun 2024 2:16 AM GMT
Next Story