వణికిపోతున్న సుజనా చౌదరి.. వెస్ట్ లో కష్టమే
ఇది పవన్ కల్యాణ్ సమస్య మాత్రమే కాదు, విజయవాడ వెస్ట్ లో కూటమి అభ్యర్థిగా బీజేపీ టికెట్ పై అసెంబ్లీకి పోటీ చేయబోతున్న సుజనా చౌదరి సమస్య.

పోతిన మహేష్ రాజీనామాతో బెజవాడ రాజకీయం రోడ్డెక్కింది. బెజవాడలో జనసేన జెండాలు తగలబడుతున్నాయి. పవన్ ని దేవుడంటూ పొగిడిన నోళ్లు ఇప్పుడు తిట్టిపోస్తున్నాయి. అయితే ఇది పవన్ కల్యాణ్ సమస్య మాత్రమే కాదు, విజయవాడ వెస్ట్ లో కూటమి అభ్యర్థిగా బీజేపీ టికెట్ పై అసెంబ్లీకి పోటీ చేయబోతున్న సుజనా చౌదరి సమస్య. అక్కడ పోతిన మహేష్ ఆల్రడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. జనసేనకు అక్కడ కార్యకర్తల బలం ఉంది. వారంతా తనకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశపడ్డారు సుజనా చౌదరి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆ సపోర్ట్ లేకపోగా వారంతా వైసీపీవైపు మళ్లే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. సో.. కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి వ్యవహారం మరింత గందరగోళంలో పడింది.
వైసీపీలోకి పోతిన మహేష్..
జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఆ విషయంపై పరోక్షంగా ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న ఆయన.. మూడు జెండాలు మోసినోళ్లకు మరో జెండా మోయడం కష్టమేమీ కాదన్నారు. అంటే వైసీపీలోకి పోతిన వెళ్లడం ఖాయం, ఆయన అనుచరగణం అంతా వైసీపీకి అదనపు బలంగా మారడం ఖాయం. మధ్యలో అడ్డంగా బుక్కైపోయారు సుజనా చౌదరి.
పవన్ కు భారీ డ్యామేజీ..
ఇంతకాలం జనసేనను వీడిపోయిన వాళ్లంతా పవన్ ని తిట్టారు కానీ, ఈ రేంజ్ లో కడిగిపారేయలేదు. కానీ పోతిన మహేష్ మాత్రం పవన్ పరువంతా బజారుకీడ్చారు. పొత్తులతో ఆయన జనసేనను చంపేశారంటూ సింగిల్ లైన్ లో తేల్చి చెప్పారు. తనలాంటి చాలామంది నాయకులను రాజకీయంగా పవన్ చంపేశారన్నారు. కొత్త పార్టీలో చేరితే అది తనకు రాజకీయ పునర్జన్మ అవుతుందని క్లారిటీ ఇచ్చారు పోతిన. పవన్ పై ఆయన పేల్చిన మాటల తూటాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.