విజయవాడ వెస్ట్.. పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీ
విజయవాడ వెస్ట్ లో ఓ సాధారణ కార్యకర్త అయిన షేక్ ఆసిఫ్ కు సీఎం జగన్ టికెట్ ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు కోటాలో సుజనా చౌదరి బీజేపీ టికెట్ పై పోటీకి వస్తున్నారు.
విజయవాడ వెస్ట్ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేన తరపున ఆ సీటు ఆశించిన పోతిన మహేష్ కి పవన్ కల్యాణ్ షాకిచ్చారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి ఇస్తున్నామని తేల్చి చెప్పారు. సీటులేని పోతిన నానా రచ్చ చేస్తున్నారు. నిరాహార దీక్షలంటూ పవన్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇక బీజేపీ తరపున ఇక్కడ బరిలో దిగాలనుకుంటున్న సుజనా చౌదరికి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు వైసీపీ నేత కేశినేని నాని.
విజయవాడ వెస్ట్ లో ఓ సాధారణ కార్యకర్త అయిన షేక్ ఆసిఫ్ కు సీఎం జగన్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడిక్కడ చంద్రబాబు కోటాలో సుజనా చౌదరి బీజేపీ టికెట్ పై పోటీకి వస్తున్నారు. ఇది నిజంగా పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. వెస్ట్‌లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్‌పై పెద్ద కుట్ర జరుగుతోంని అన్నారాయన. ఒక పేద ముస్లింని ఓడించడానికి బీజేపీ ఒక పెద్ద ధనికుడిని తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమలో ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్నారని.. వారంతా వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కే ఓటు వేస్తారని అన్నారు.
సీఎం జగన్ సామాన్య కార్యకర్తకు టికెట్ ఇస్తే.. మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్‌లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారని అన్నారు కేశినేని నాని. చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారని, కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారన్నారు. డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారని చెప్పారు నాని. పేదలకు, పెత్తందార్లకు జరిగే యుద్ధంలో అంతిమ విజయం పేదలదేనని, పేదల పక్షాన ఉన్న వైసీపీదేనని అన్నారు కేశినేని నాని.