హైదరాబాద్ రెవెన్యూలో వాటా అడగండి.. బాబుకి విజయసాయి సూచన
వారు వాటా కావాలని అడిగితే, మనం కూడా వాటా అడుగుదామన్నారు. హైదరాబాద్ రెవెన్యూలో వాటా అడిగితే అప్పుడు లెక్క సరిపోతుందనేది విజయసాయి ట్వీట్ సారాంశం.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఏపీ ఓడరేవుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ డిమాండ్ చేసిందని, టీటీడీలో కూడా వాటా అడిగిందని అంటున్నారు. ఏపీ సొత్తు తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబుకి అధికారం ఏముందని వైసీపీ సానుభూతి పరులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకి ఓ ఆసక్తికర సూచన చేశారు.
If the rumours that Telangana is eyeing a share in TTD and a part of AP’s coastline & ports are true then I urge AP CM @ncbn to ask for a share in Hyderabad’s revenue. The AP govt. should not place the friendship between the 2 CMs over the interests of the people of AP. #APfirst
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 7, 2024
ఏపీ తీర ప్రాంతంలో, ఓడరేవుల్లో, టీటీడీలో.. తెలంగాణ ప్రభుత్వం వాటా అడగటం నిజమే అయితే.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ రెవెన్యూలో వాటా అడగాలని సూచించారు విజయసాయిరెడ్డి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్నేహం కోసం ఏపీ ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని ఆయన చెప్పారు. వారు వాటా కావాలని అడిగితే, మనం కూడా వాటా అడుగుదామన్నారు. హైదరాబాద్ రెవెన్యూలో వాటా అడిగితే అప్పుడు లెక్క సరిపోతుందనేది విజయసాయి ట్వీట్ సారాంశం.
మంత్రులతో కమిటీ, అధికారులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి సానుకూల మార్గం చూడబోతున్నామని మాత్రమే ముఖ్యమంత్రుల చర్చల తర్వాత నేతలు అధికారికంగా ప్రకటించారు. చర్చల్లో ఏ రాష్ట్రం ఏం డిమాండ్ చేసిందనేది ప్రస్తుతానికి ఊహాగానం మాత్రమే. ఆ ఊహాగానాలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరు రాష్ట్రాల డిమాండ్లు నెరవేర్చాలంటే రెండు రాష్ట్రాలను తిరిగి ఏకం చేయాలని పేర్ని నాని సెటైర్ వేశారు. తాజాగా హైదరాబాద్ రెవెన్యూలో వాటా అడగాలంటూ విజయసాయిరెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులకు కౌంటర్ ఇచ్చారు.