ఈసారి రాజ్యసభలోనే విజయసాయిరెడ్డి పేరు ప్రకటించిన చైర్మన్
రాజ్యసభ వేదికగా విజయసాయిరెడ్డి, పీటి ఉషలను ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నియమిస్తూ చైర్మన్ ప్రకటించారు. వారిద్దరికి సభలో సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రాజ్యసభలో ప్యానెల్ వైస్ చైర్మన్‌గా ఆయన్ను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నియమించారు. రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. విజయసాయిరెడ్డితో పాటు నామినేటెడ్ ఎంపీ పీటీ ఉషను కూడా ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించారు.
కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి సహా ఎనిమిది మంది ఎంపీ పేర్లతో ప్యానెల్ చైర్మన్ల జాబితాను తొలుత విడుదల చేశారు. ఆ తర్వాత ఆ జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు గల్లంతు అయింది. దాంతో విజయసాయిరెడ్డికి షాక్ అంటూ టీడీపీ ప్రచారం చేసింది. విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లపై రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారని, దాని ప్రభావంతోనే ఆయన్ను ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుంచి తొలగించారంటూ ప్రచారం కూడా జరిగింది.
అయితే మంగళవారం రాజ్యసభ వేదికగా విజయసాయిరెడ్డి, పీటి ఉషలను ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నియమిస్తూ చైర్మన్ ప్రకటించారు. వారిద్దరికి సభలో సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తమ నియామకం పట్ల చైర్మన్‌కు విజయసాయిరెడ్డి, పీటీ ఉష కృతజ్ఞతలు తెలిపారు.