Telugu Global
Andhra Pradesh

రాజ్యసభలో చంద్రబాబు అవినీతి చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి

ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. దీనిపై న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే టీడీపీ అఖిలపక్ష సమావేశంలో నానా యాగీ చేసిందన్నారు.

రాజ్యసభలో చంద్రబాబు అవినీతి చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి
X

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను అవకాశంగా మార్చుకుని జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని చర్చకు తేవాలని చూసింది టీడీపీ. కానీ సీన్ రివర్స్ అయింది. చంద్రబాబుపై సింపతీ పెరగకపోగా ఆయన అవినీతి, వెన్నుపోట్ల వ్యవహారం పార్లమెంట్ లో హైలైట్ గా మారింది. చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టీడీపీ సభ్యులు వైసీపీ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అవినీతి, వెన్నుపోట్లకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ ఆయన రాజ్యసభలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీల అనుచిత చర్యలకు సమాధానంగానే చంద్రబాబు అవినీతి కుంభకోణాలు, నేర చరిత్ర గురించి సభలో ప్రస్తావించాల్సి వచ్చిందని అన్నారాయన.

విజయసాయి ఏమన్నారంటే..?

"అంతులేని అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు కేరాఫ్‌ అడ్రస్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌ లకు పాల్పడి చంద్రబాబు 6 లక్షల కోట్లకు అధిపతిగా మారాడు. చంద్రబాబుపై 9 క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. దాన్ని బట్టే ఆయన క్రిమినల్‌ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. రాజకీయాల్లో వెన్నుపోట్లు చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ మన ప్రజాస్వామ్యం దుస్థితి." అంటూ రాజ్యసభలో తీవ్ర విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబు సీఎంగా ఉండగా కోట్లాది రూపాయల స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్ జరిగిందని, అందులో నిందితుడిగా ఆయన్ని పేర్కొంటూ ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు విజయసాయిరెడ్డి. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిందని గుర్తు చేశారు. దీనిపై న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు టీడీపీ అఖిలపక్ష సమావేశంలో నానా యాగీ చేసిందన్నారు. టీడీపీకి న్యాయప్రక్రియపై నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అవినీతిపరుడిని వెనకేసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని చెప్పారు విజయసాయిరెడ్డి.

First Published:  18 Sept 2023 8:49 PM IST
Next Story