గెలుపోటముల బాధ్యతంతా సారథులపైనేనా?
రాబోయే ఎన్నికల్లో గృహ సారథులు, కుటుంబ సారథుల మీద వైసీపీ, టీడీపీ గెలుపోటములు ఆధారపడినట్లున్నాయి. ఎందుకంటే సారథుల వ్యవస్థల మీదే జగన్, చంద్రబాబులు అంతగా ఆధారపడ్డారు కాబట్టే.
సారథులు...పేరు ఒకటే కానీ సారథుల్లోనే రెండు రకాల సారథులు ఉన్నారు. ఒకరేమో గృహ సారథులు మరొకరేమో కుటుంబ సారథులు. గృహ సారథులేమో జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లోనుండి పుట్టిన వ్యవస్థ. కుటుంబ సారథుల వ్యవస్థ ఏమో చంద్రబాబునాయుడు కాపీ వ్యవస్థ. జగన్ గృహ సారథులను చూసి అచ్చంగా అలాంటి వ్యవస్థనే చంద్రబాబు కాపీకొట్టి కుటుంబ సారథులన్నారు. రాబోయే ఎన్నికల్లో గృహ సారథులు, కుటుంబ సారథుల మీద వైసీపీ, టీడీపీ గెలుపోటములు ఆధారపడినట్లున్నాయి. ఎందుకంటే సారథుల వ్యవస్థల మీదే జగన్, చంద్రబాబులు అంతగా ఆధారపడ్డారు కాబట్టే.
విచిత్రం ఏమిటంటే సారథులు ఇద్దరు వెళ్ళేది ఒక ఇంటికే. కలిసేది కూడా ఒకళ్ళనే. కానీ ఉద్దేశాలు మాత్రం వేర్వేరు, పైగా పూర్తి విరుద్ధాలు. గృహ సారథులేమో ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా? ప్రతి కుటుంబానికి ఎన్ని పథకాలు అందుతున్నాయి, కుటుంబానికి ఎంత మేర లబ్ధి చేకూరింది అనే వివరాలను ఎప్పటికప్పుడు వాకాబు చేస్తుంటారు. పథకాలు రెగ్యులర్‌గా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంటారు.
ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో గృహ సారథుల బాధ్యతలు చాలా కీలకమైనవనే చెప్పాలి. వాలంటీర్లు ఇప్పుడు నిర్వహిస్తున్న బాధ్యతలకు గృహ సారథులు అదనం అన్నమాట. అంటే వీళ్ళ బాధ్యతలు పూర్తిగా పాజిటివ్‌గా ఉంటుందనే అనుకోవాలి. ఇదే సమయంలో కుటుంబ సారథులు కూడా ప్రతి ఇల్లు తిరుగుతారు. వీళ్ళంతా తెలుగుదేశంపార్టీ తరపున తిరగబోతున్నారు. సుమారు 6 లక్షల మంది కుటుంబ సారథులను నియమించాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. వీళ్ళు ఏం చేస్తారంటే సంక్షేమ పథకాలు అందని వాళ్ళపైన దృష్టిపెడతారు.
పథకాలు ఎందుకు అందటంలేదు, లేకపోతే అనర్హుల్లో ఎవరికైనా పథకాలు అందుతున్నాయా అని గమనిస్తుంటారు. పథకాల అమల్లోని లోపాలను, లబ్ధిదారుల్లోని అసంతృప్తిని ఎప్పటికప్పుడు టీడీపీ నేతలకు చేరవేస్తుంటారు. దాన్నిబట్టి ఆందోళనలు, నిరసనలకు టీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటుంది. అంటే కుటుంబ సారథులే పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే కార్యకర్తలన్నమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు సేకరించి ఇచ్చే ఇన్‌పుట్స్ మీదే చంద్రబాబు ఆధారపడతారు. మొత్తానికి ఇద్దరి సారథ్యం మీద వైసీపీ, టీడీపీ గెలుపోటములు ఆధారపడినట్లే అనిపిస్తోంది. మరి ఎవరి సారథులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారో చూడాలి.
♦