జగన్ సర్కార్‌కు తలనొప్పిగా విక్టర్ ప్రసాద్ వ్యవహారం
ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన విక్టర్ ప్రసాద్.. ''గాంధీని మీరంతా మహాత్ముడు అంటే.. నేను దుర్మార్గుడు, నీచుడు అంటాను'' అంటూ మాట్లాడారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ఆయన నియామకం సమయంలోనే పలువురు జగన్‌ను హెచ్చరించినట్టు ప్రచారం ఉంది. దళితుల కోసం పోరాటం చేసే విక్టర్ ప్రసాద్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారని.. ఆయన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పాలసీల ప్రకారం నడుచుకుంటారో లేదో అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ అవేవీ పట్టించుకోకుండా రాజ్యాంగ రక్షణ కలిగిన ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన ఏకంగా మహాత్మ గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్షం విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన విక్టర్ ప్రసాద్.. ''గాంధీని మీరంతా మహాత్ముడు అంటే.. నేను దుర్మార్గుడు, నీచుడు అంటాను'' అంటూ మాట్లాడారు. ''ఈ దేశంలో ఓటు హక్కు ఎవరికి ఉండాలన్న దానిపై 1932లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే.. అప్పుడు గాంధీ అనే దుర్మార్గుడు.. ఈ దేశంలో బ్రహ్మణులు, వైశ్యులు, రాజులతో పాటు ఒకటి రెండు కులాలకు తప్ప మిగిలిన కులాలకు ఓటు హక్కు వద్దన్నారు. ఆడవారు ఏ కులంలో పుట్టినా వారిని ఓటు హక్కు గానీ, విద్య గానీ, ఆస్తిలో హక్కు గానీ అవసరం లేదని గాంధీ వాదించారు'' అని విక్టర్ ప్రసాద్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి.
విక్టర్ లాంటి దేశద్రోహులను జగన్ పాలు పోసి పెంచుతున్నారు- జవహర్
గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విక్టర్ ప్రసాద్‌ను వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టీడీపీ మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. విక్టర్ లాంటి దేశద్రోహులకు జగన్ పాలుపోసి పెంచుతున్నారని ఇప్పుడు గాంధీని కించపరిచిన వ్యక్తులు రేపు అంబేద్కర్‌నూ కించపరుస్తారని జవహర్ విమర్శించారు. గాంధీజీని కొన్ని కులాలకు పరిమితం చేసే కుట్రగా అభివర్ణించారు. విక్టర్ ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీని నీచుడు, దుర్మార్గుడు అంటూ విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైశ్యులు స్పందించాలన్నారు.
అటు విక్టర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి పట్టణంలో దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విక్టర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంలో ఉద్యమానికి మద్దతుగా బ్రహ్మణ సమాజం కూడా నిలుస్తుందని బ్రహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ చెప్పారు.
నష్టనివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం
విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదంగా మారే అవకాశం ఉండటంతో మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలతో వైసీపీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. విక్టర్ ప్రసాద్ ఎప్పుడూ తమ పార్టీలో లేరని చెప్పారు. ఎస్సీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విక్టర్ ప్రసాద్‌పై ఇతర కులాల హక్కులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. గాంధీజీపై విక్టర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. విక్టర్ ప్రసాద్‌ను తొలగించే అవకాశం సీఎం పరిధిలో లేదు. కాబట్టి విక్టర్ ప్రసాద్‌ను ప్రభుత్వం నియంత్రించే అవకాశాలు లేవు. ఈ వ్యాఖ్యలపై విక్టర్ ప్రసాద్ వివరణ ఇస్తారేమో చూడాలి.