ఆనం సేవలు ఇక చాలా?.. కమిషనర్ మేసేజ్ అర్థమేంటి?
వైసీపీకి, ఆనంకు మధ్య గ్యాప్ పూర్తిగాపెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆనంకు వైసీపీ టికెట్ రాబోదన్నది దాదాపు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గాన్ని రామ్‌కుమార్ రెడ్డి తన కనుసన్నల్లోకి తీసుకుంటున్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ గట్టిగానే పొగపెడుతోంది. బహిరంగ వేదికలపై విమర్శలకు దిగిన ఆనంను ఇప్పటికే వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించి.. నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఆ తర్వాత ఆనం గన్‌మెన్ల సంఖ్యను కుదించారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆనం రామనారాయణరెడ్డికి పంపిన మేసేజ్ చర్చనీయాంశమైంది.
ఇకపై అధికారులు కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మాట వినబోరన్న అర్థం సదరు మేసేజ్‌తో కలుగుతోంది. గడపగడపకు కార్యక్రమంలో ఇప్పటి వరకు మీరు అందించిన సహకారం మరువలేనిదని, అందుకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మున్సిపల్ కమిషనర్ మేసేజ్ పంపించారు.
గడప గడపకు కార్యక్రమం పార్టీ పరంగా జరగడం లేదు.. అదో ప్రభుత్వ కార్యక్రమం. అలాంటి కార్యక్రమానికి ఇప్పటి వరకు మీరు అందించిన సహకారం మరువలేనిది అంటూ కమిషనర్ మేసేజ్ చేయడంతో.. ఇకపై కార్యక్రమంలో పాల్గొనవద్దని ఆనంకు పరోక్షంగా కమిషనర్ స్పష్టం చేశారా..? మీరు గడప గడపకు వచ్చినా అధికార యంత్రాంగం రాబోదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారా..? అన్న చర్చ నడుస్తోంది.
వైసీపీకి, ఆనంకు మధ్య గ్యాప్ పూర్తిగాపెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆనంకు వైసీపీ టికెట్ రాబోదన్నది దాదాపు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గాన్ని రామ్‌కుమార్ రెడ్డి తన కనుసన్నల్లోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక ఆనం అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. ఆయన పరిస్థితి ప్రతిపక్షమే.