సీఎం జగన్ తో వెల్లంపల్లి భేటీ.. బెజవాడలో హీటెక్కిన పాలిటిక్స్
నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రమే తాను సీఎం జగన్ ని కలసినట్టు చెప్పుకొచ్చారు వెల్లంపల్లి. తాను, విజయవాడ మేయర్ కలిసి క్యాంప్ ఆఫీస్ వెళ్లామని, తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాత్రమే సీఎంతో మాట్లాడామని అన్నారు.
ఏపీ సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు వైసీపీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. అందులో కొందరు మంత్రులు కూడా ఉండటం విశేషం. ఈరోజు కూడా కొందరు నేతలు తాడేపల్లి వెళ్లారు. అందులో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సీఎం జగన్ ని కలసి బయటకొచ్చిన ఆయన ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. తాను పార్టీకి రాజీనామా చేశానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అసలేం జరిగింది..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఈసారి అదే నియోజకవర్గం దక్కకపోవచ్చనే ప్రచారం ఉంది. ఆయన్ను విజయవాడ సెంట్రల్ స్థానానికి పంపిస్తున్నారని, వెస్ట్ లో పోటీ చేసే అవకాశం విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మికి ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మేయర్ భాగ్యలక్ష్మితోపాటు వెల్లంపల్లి సీఎం కార్యాలయానికి వెళ్లడం విశేషం. దీంతో ఆయన నియోజకవర్గ మార్పు ఖాయమని తేలిపోయింది. ఆ ప్రతిపాదన నచ్చక ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారని కూడా టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. దీంతో మీటింగ్ తర్వాత బయటకొచ్చిన వెల్లంపల్లి ఎల్లో మీడియాపై ధ్వజమెత్తారు.
నాకేం చెప్పలేదు..
నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రమే తాను సీఎం జగన్ ని కలసినట్టు చెప్పుకొచ్చారు వెల్లంపల్లి. తాను, మేయర్ కలిసి క్యాంప్ ఆఫీస్ వెళ్లామని, తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాత్రమే సీఎంతో మాట్లాడామని అన్నారు. తనని విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారనేది తప్పుడు ప్రచారం అని తేల్చి చెప్పారు. అదే సమయంలో సీఎం జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు వెల్లంపల్లి. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీయే గెలుస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిచి సీఎం జగన్ కు బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి.