అందుకే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు- వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్
ప్రభుత్వాలు మారగానే విధానాలు మార్చడం సరికాదన్నారు. ఉదాహరణగా ఏపీ ప్రభుత్వాన్ని చూపించారాయన. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ వెళ్లడం లేదని
ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రెండు వేల కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైన వేదాంత గ్రూప్ అందుకు అనువైన రాష్ట్రం కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర ఆహ్వానించగా.. కర్నాటక కూడా భారీ రాయితీలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
ఈ నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చించేందుకు బెంగళూరు వచ్చిన అనిల్ అగర్వాల్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారగానే విధానాలు మార్చడం సరికాదన్నారు. ఉదాహరణగా ఏపీ ప్రభుత్వాన్ని చూపించారాయన. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ వెళ్లడం లేదని.. అందుకు కారణం అక్కడ ప్రభుత్వాలు మారగానే పారిశ్రామిక విధానాలను మార్చేయడమేనని అనిల్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఏపీలో పెట్టుబడులు పెట్టే ఆలోచనే లేదని తేల్చేశారు.
పరిశ్రమకు పెద్దస్థాయిలో రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వాలు సుముఖంగా ఉండవని.. కానీ ఇచ్చే రాయితీల కంటే 10 రెట్లు లాభం పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు దక్కుతుందని ఆయన వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలు స్పష్టంగా ఉండాలన్నారు. విధానాలను పదేపదే మార్చకూడదని.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతుండడం వల్లనే అక్కడికి ఎవరూ వెళ్లాలనుకోవడం లేదన్నారు.