విశాఖ దక్షిణం.. వాసుపల్లి గణేష్ త్రిశంకుస్వర్గం
టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరినా నియోజకవర్గంలో వైసీపీ నేతలు వాసుపల్లిని తమవాడిగా గుర్తించడంలేదు. సమాంతరంగా సీతంరాజు సుధాకర్ రూపంలో మరో పవర్ సెంటర్ తయారైంది.
రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మహత్యలే అంటారు. దీనికి నిదర్శనం విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. 2019 ఎన్నికల్లో అతను విశాఖ దక్షిణం నుంచి గెలిచాడు. కానీ, తన పార్టీ ఓడిపోయింది. దీంతో అధికార వైసీపీలో చేరాడు. వైసీపీలో అప్పటికే తనపై ఓడిపోయిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఉన్నారు. ఆయన హఠాత్తుగా మృతి చెందడంతో ఇక తనకి సీటు చింత లేదని వైసీపీలో ధీమాగా చేరిపోయారు. ఇక్కడి నుంచే ట్విస్టులు మొదలయ్యాయి.
టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరినా నియోజకవర్గంలో వైసీపీ నేతలు వాసుపల్లిని తమవాడిగా గుర్తించడంలేదు. సమాంతరంగా సీతంరాజు సుధాకర్ రూపంలో మరో పవర్ సెంటర్ తయారైంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న సీతంరాజు ఎమ్మెల్యేగా తానే చలామణి అవుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌తో సరిపెట్టుకుని తనకి సౌత్ సీటు వదిలేస్తారని వాసుపల్లి ఆశించినట్టే సీతంరాజుని ఉత్తరాంధ్ర పట్టభద్రుల బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. సీతంరాజు గెలిచేస్తే, దక్షిణం వైసీపీ సీటు తనకే అని వాసుపల్లి గణేష్ ధీమాతో ఉన్నారు. అనూహ్యంగా సీతంరాజు సుధాకర్ టీడీపీ మద్దతు అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సీతంరాజు సుధాకర్ విశాఖ దక్షిణం సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే విశాఖ దక్షిణం నుంచి పోటీచేస్తానని సీతంరాజు సుధాకర్ ప్రకటించి కలకలం రేపారు. వాసుపల్లి ఆశలు అడియాశలు చేశారు.
కోలా గురువులు ఎమ్మెల్సీగా ఓటమి చెందడంతో వాసుపల్లి సీటుకి పోటీగా మరొకరు కూడా రేసులోకొచ్చారు. వాస్తవంగా కోలా గురువులు విశాఖ దక్షిణంకి చెందిన మత్స్యకార సంఘం నేత. ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే, దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ సులువుగా విజయం సాధించవచ్చని ఆ పార్టీ పెద్దలు వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి.
స్థానికుడైన కోలా గురువులు మెగాస్టార్ పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో కలిపేయడం, అనంతరం రాజశేఖర రెడ్డి మృతితో.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ స్థాపించడంతో కోలా గురువులు జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ సాధించిన కోలా గురువులు, టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీచేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఓటమి పాలవ్వగా, గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతుగా నిలిచారు. వైసీపీని నమ్ముకున్న కోలా గురువులుకి ముందుగా మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా కూడా వైసీపీ ఇచ్చిన అవకాశంలో గెలిచి వుంటే, వాసుపల్లికి టికెట్ పోరు తప్పేది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఓడిపోయిన కోలా గురువులు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఓడిపోయిన సీతంరాజు సుధాకర్ దక్షిణం సీటు రేసులోకొచ్చారు. తిరిగి టీడీపికి వెళ్లాలనుకున్నా అక్కడ ఆల్రెడీ బలమైన అభ్యర్థి గండి బాబ్జీని ఇన్‌చార్జిగా దింపారు. ఎటూ వెళ్లలేని వాసుపల్లి గణేష్, టికెట్ హామీ కూడా లేని వైసీపీ త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడుతున్నాడు.