Telugu Global
Andhra Pradesh

పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా వర్మ.. పవన్‌కు కష్టమే.!

వర్మ అనుచరులు పిఠాపురంలో విధ్వంసం సృష్టించారు. వర్మకు చంద్రబాబు, లోకేశ్‌ తీవ్ర అన్యాయం చేశారంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా వర్మ.. పవన్‌కు కష్టమే.!
X

పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేస్తానని చెప్పడంతో.. తెలుగుదేశం కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఇక తెలుగుదేశం నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. గత ఐదేళ్లుగా పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు వర్మ.

పొత్తులో భాగంగా పిఠాపురం జనసేనకు కేటాయించడంతో.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని ప్రకటించారు వర్మ. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అంటూ సోషల్‌మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్‌ ఫోటోలను తొలగించారు.


అంతకుముందు వర్మ అనుచరులు పిఠాపురంలో విధ్వంసం సృష్టించారు. వర్మకు చంద్రబాబు, లోకేశ్‌ తీవ్ర అన్యాయం చేశారంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం జెండాలను, ప్లకార్డులను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అటు పవన్‌కల్యాణ్‌పైనా మండిపడ్డారు వర్మ అనుచరులు. దమ్ముంటే గతంలో ఓడిపోయిన సీట్లలోనే పోటీ చేసి గెలవాలంటూ సవాల్‌ విసిరారు.

2014లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ.. 47 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2019లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయారు. ఇక వర్మ స్వతంత్రంగా పోటీ చేసినా 30-35 వేల ఓట్లు పడే అవకాశాలున్నాయన్న వార్తలతో జనసైనికుల్లో ఆందోళన మొదలైంది.

First Published:  14 March 2024 7:33 PM IST
Next Story