ఓట్ల పండగకు ఆహ్వాన పత్రిక.. ఏలూరు డీపీఓ వినూత్న ఆలోచన
ఓటింగ్ పండగలో పాల్గొంటే ఒకరోజు విందుతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదని, వచ్చే ఐదేళ్లూ అభివృద్ధి ఫలాలు అందుకోవచ్చని సూచించారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పోలింగ్ తేదీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు వివిధరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ శాతం పెంచే దిశగా ఓటర్లను చైతన్య పరిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్ తూతిక శ్రీనివాస్ ఓ వినూత్న ఆలోచన చేశారు. పెళ్లి కార్డు తరహాలో ఓట్ల పండగ ఆహ్వాన పత్రికను ముద్రించారు. గ్రామాల్లో వాటిని పంచి పెడుతున్నారు, ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.
శుభాకార్యాలకు పంచే ఆహ్వాన పత్రికల లాగే ఈ ఇన్విటేషన్ తయారు చేయించారు. మీ ఇంటిలోని ఓటర్లందరికీ ఇదే మా ఆహ్వానం అంటూ అందులో ప్రింట్ చేయించారు. సుముహూర్తం అనే స్థానంలో పోలింగ్ తేదీ, సమయం ముద్రించారు. పోలింగ్ తేదీ 2024 మే 13 - బుధవారం. సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అని తెలిపారు. వేదిక అనే చోట మీ దగ్గర్లోని పోలింగ్ స్టేషన్ అని సూచించారు. విందు కూడా ఉందంటూ వెరైటీ కొటేషన్ పెట్టారు. ఓటింగ్ పండగలో పాల్గొంటే ఒకరోజు విందుతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదని, వచ్చే ఐదేళ్లూ అభివృద్ధి ఫలాలు అందుకోవచ్చని సూచించారు. చివరిగా ముఖ్య గమనిక అంటూ.. ఓట్ల పండగకు వచ్చేవారంతా తమ గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని చెప్పారు.
ఎన్నికలంటే అందరికీ ఆసక్తి. సోషల్ మీడియాలో అందరూ కొటేషన్లు పెడుతుంటారు కానీ.. సరిగ్గా పోలింగ్ రోజు మాత్రం ఇల్లు కదలరు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే పట్టణాల్లో పోలింగ్ శాతం మరీ తక్కువగా ఉంటోంది. దీంతో అధికారులు తమ తమ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ, దీనివల్ల ఓట్ల శాతం పెరుగుతుందో లేదో చూడాలి.