వారాహియే మైనస్ అవుతోందా?
పవన్ మాటల్లో భావం కాకుండా గోల మాత్రమే జనాలకు చేరుతోంది. వారాహి యాత్ర మొదలుపెట్టకుండా ఉంటేనే పవన్‌కు గౌరవంగా ఉండేదేమో అని జనసేన నేతలే అనుకునే స్థాయికి దిగజారిపోయింది యాత్ర.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకించి వేరే ప్రత్యర్థి అవసరంలేదు. ఎందుకంటే పవన్‌లో అపరిచితుడు ఉన్నాడంటూ మంత్రులు ఎద్దేవా చేస్తుంటారు. తనలోని అపరిచితుడే పవన్‌కు పెద్ద మైనస్ కాబోతున్నారు. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటాడో పవన్‌కే తెలియదు. ఏ రోజు ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. నిన్న మాట్లాడిన మాటకు రేపు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతాడు. దాంతో పవన్ మాట్లాడిన మాటల్లో ఏది కరెక్టో తెలుసుకోవటానికి జనాలు జుట్టు పీక్కోవాలి.
పవన్ కోసం జనాలు జుట్టు ఎందుకు పీక్కోవాలి? అందుకనే పవన్‌ను నమ్మటం మానేస్తున్నారు. పవన్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదనుకుంటున్నారు. వారాహి యాత్ర మొదలుకాకముందు తనకు సీఎం అభ్యర్థి అయ్యే అర్హత కూడా లేదన్నారు. యాత్ర మొదలైన తర్వాత తననే సీఎం చేయమంటున్నారు. యాత్రకు ముందు టీడీపీతో పొత్తు ఉంటుందన్నారు. యాత్రలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురించి నానా మాటలన్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తొడకొట్టి మరీ తన కసినంత తీర్చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి ఎలా గెలుస్తారో చూస్తానని చాలెంజ్ చేశారు. స్పీచంతా అయిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో కూడా చెప్పలేనన్నారు. కాకినాడలో గంటన్నరసేపు మాట్లాడిన పవన్ పదేపదే జనసేనకు అధికారం ఇవ్వమన్నారు. తీరా కాకినాడలో స్పీచ్ ముగించేముందు ఇక్కడున్న వాళ్ళు కూడా తనకు ఓట్లేస్తారో లేదో నమ్మకం లేదన్నారు.
పార్టీ అధినేత స్థాయిలో కాకుండా బాగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. పవన్ ఎక్కడమాట్లాడినా కులాలు, కాపుల గోల లేకుండా మాట్లాడలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు కూడా కులాలవారీగానే టికెట్లిచ్చినా బహిరంగంగా మాట్లాడరు. పవన్ వైఖరి చూస్తుంటే నిజంగానే అపరిచితుడు సినిమాలో క్యారెక్టర్‌ను చూస్తున్నట్లే ఉంది. ఏమి మాట్లాడాలని అనుకుని ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుని ఏమి చెబుతున్నారో అర్థంకావటంలేదు. పవన్ మాటల్లో భావం కాకుండా గోల మాత్రమే జనాలకు చేరుతోంది. వారాహి యాత్ర మొదలుపెట్టకుండా ఉంటేనే పవన్‌కు గౌరవంగా ఉండేదేమో అని జనసేన నేతలే అనుకునే స్థాయికి దిగజారిపోయింది యాత్ర.