వారాహిపై మళ్లీ రగడ.. ఈసారి పైచేయి ఎవరిదంటే..?
ఆ వాహనానికి వారం క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని, అయినా కూడా ఆ విషయం దాచిపెట్టి వైసీపీ నేతల్ని ఫూల్ చేశామంటూ జనసేన నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.
పొలిటికల్ యాత్రకోసం పవన్ కల్యాణ్ ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్న వాహనం వారాహి. అయితే ఆ వాహనం రంగుపై మొదలైన రగడ, చివరకు ఆర్టీఏ రిజిస్ట్రేషన్ కుదరదు అనేంత వరకు వెళ్లింది. వారాహిపై పేర్ని నాని కౌంటర్లు, దానికి పవన్ రివర్స్ అటాక్ అందరికీ తెలిసిందే. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయలేమని తెలంగాణ ఆర్టీఏ తేల్చి చెప్పినట్టు, టైర్లు పెద్దగా ఉన్నాయని, ఛాసిస్ మార్చేశారని కొర్రీలు వేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి. కట్ చేస్తే.. అసలు వారం క్రితమే ఆ వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలంగాణ ఆర్టీఏ అధికారులు తేల్చి చెప్పారు. వాహనం నెంబర్ ఇదీ అంటూ ప్రకటించారు.
సోషల్ మీడియాలో వార్..
వారాహికి రిజిస్ట్రేషన్ కానే కాదంటూ నిన్నటి వరకూ సోషల్ మీడియాలో వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. ఆ వాహనానికి వారం క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని, అయినా కూడా ఆ విషయం దాచిపెట్టి వైసీపీ నేతల్ని ఫూల్ చేశామంటూ జనసేన నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. వారం క్రితమే రిజిస్ట్రేషన్ అయినా, పేర్ని నాని సహా చాలామంది సలహాలిచ్చి నవ్వులపాలయ్యారని అంటున్నారు. మా నాయకుడి వాహనానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడో అయిపోయిందోచ్ అంటూ హడావిడి చేస్తున్నారు.
అది ఎమరాల్డ్ గ్రీన్..
అది ఆలివ్ గ్రీన కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అంటూ ఆర్టీఏ అధికారులే స్టేట్ మెంట్ ఇచ్చారు. టైర్లు పెద్దవని, లారీ ఛాసిస్ వాడారంటూ రిజిస్ట్రేషన్ ఆగిపోయిందనే వార్తలు కూడా పుకార్లేనని తేలిపోయాయి. మరి వారం రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ అయితే దానిపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జనసేన తరపున ఆ విషయం తెలిసినవారు నోరు మెదపకపోవడం మాత్రం విచిత్రమే. వైసీపీ నాయకుల మాటల తూటాలు, టీవీ డిబేట్లు, పత్రికల్లో కథనాలు.. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనసేన నుంచి కౌంటర్లు పడుతున్నాయి. వారం క్రితమే మా పని పూర్తయిందంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. రోడ్డుపైకి రాకముందే వారాహి ఇంత రచ్చ చేసిందంటే.. ఇక రోడ్డుపైకి వస్తే మా ప్రతాపం ఎలా ఉంటుందో చూడండి అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.