అమరావతి రైతు యాత్రకోసం వంగవీటి, పరిటాల..
రాజమండ్రిలో అమరావతి యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పరిటాల శ్రీరామ్, ఓ హోటల్ లో వంగవీటి రాధాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అటు విశాఖ గర్జన హైలెట్ అయింది, ఇటు అమరావతి యాత్రకి ఊపు కాస్త తగ్గింది. దీంతో ఈ యాత్రకి స్పెషల్ అట్రాక్షన్ కోసం స్పెషల్ గెస్ట్ లను తీసుకొస్తోంది టీడీపీ. అనంతపురం నుంచి పరిటాల శ్రీరామ్ రాజమండ్రి చేరుకున్నారు. అమరావతి రైతుల యాత్రలో ఆయన పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన వంగవీటి రాధాను కలవడం విశేషం. టీడీపీతో అంటీముట్టనట్టుగా ఉన్న రాధా, ఇప్పుడు పరిటాల శ్రీరామ్ తో మంతనాలు జరపడంపై ఆసక్తికర చర్చ మొదలైంది.
రాధా ఎటు..?
వంగవీటి రాధా టీడీపీలో ఉన్నా లేనట్టే. అదే సమయంలో ఆయన వైసీపీకి కూడా దగ్గర కాలేదు, అటు జనసేన నుంచి కూడా ఆఫర్ ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరకపోయినా, వైసీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీతో మాత్రం వంగవీటి రాధా టచ్ లో ఉండటం విశేషం. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన అమరావతి యాత్రకు మద్దతు తెలపాలనుకుంటున్నారు. అంటే ఒకరకంగా వైసీపీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. సో రాధా, వైసీపీ మధ్య ఉన్న ఆ కాస్త బంధం కూడా తెగిపోయినట్టే లెక్క. ఎలాగూ టీడీపీ, జనసేన కలవాలనుకుంటున్నాయి కాబట్టి రాధా ఏ పార్టీకి ఫిక్స్ అయినా పెద్ద సమస్య ఉండదు.
రాజమండ్రిలో అమరావతి యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పరిటాల శ్రీరామ్, ఓ హోటల్ లో వంగవీటి రాధాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ కూడా వీరితో కలసి అమరావతి యాత్రలో పాల్గొనబోతున్నారు.
అమరావతి యాత్రకు టీడీపీ నేతలు నేరుగా మద్దతు తెలుపుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, నల్ల బెలూన్లు, నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అనంతపురం నుంచి పరిటాల శ్రీరామ్ రావడం, ఇటు వంగవీటి రాధా కూడా యాక్టివ్ కావడంతో యాత్ర మళ్లీ వార్తల్లోకెక్కింది.