పవన్ వి దింపుడు కళ్లెం ఆశలు.. వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
పవన్ కల్యాణ్ వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు వంగా గీత. చివరి ప్రయత్నంగా తన రాజకీయ జీవితంపై ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
పిఠాపురంలో మాటల తూటాలు పేలుతున్నాయి. వంగా గీతకు తన అన్నయ్య చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారన్నట్టుగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ వ్యాఖ్యలకు గీత కౌంటర్ ఇచ్చారు. 2009కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారామె. 2009లో తనకు చిరంజీవి అవకాశం ఇచ్చారని చెప్పారు. పవన్ కల్యాణ్ వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. చివరి ప్రయత్నంగా తన రాజకీయ జీవితంపై ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు వంగా గీత.
ఇంతకీ పవన్ ఏమన్నారు..?
పిఠాపురం చేరికల మీటింగ్ లో పవన్ కల్యాణ్, వంగా గీత ప్రస్తావన తీసుకొచ్చారు. 2009లో పిఠాపురం నుంచి ఆమె ప్రజారాజ్యం తరపున గెలిచారని గుర్తు చేశారు. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు పవన్. ఆయన వ్యాఖ్యలతో కలకలం రేగింది. పవన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తన ప్రత్యర్థిని తన పార్టీలోకి ఆహ్వానించడమేంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ వ్యాఖ్యలకు వంగా గీత కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం విశేషం.
నేను కూడా అనగలను..
తాను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు వంగా గీత. పిఠాపురంలో తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని తెలిపారామె. ఇక పిఠాపురం జనసేన నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. పిఠాపురం జనసేనలో కీలక నేత మానినీడు శేషు కుమారి జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. అక్కడ టీడీపీ వర్మ వర్గం సైలెంట్ అయినా.. జనసేన నుంచి వైసీపీలోకి వలసలు మొదలవడం విశేషం.