Telugu Global
Andhra Pradesh

నాగబాబు అజ్ఞానానికి ‘ఉప్మాకథే’ నిదర్శనమా?

కేవలం జగన్‌పైన అక్కసును తీర్చుకోవటమే. తాజా కథాకళిలో ఉప్మాకథ పేరుతో ఒక కంపేరిజన్ అంటూ ఎందుకూ పనికిరాని కథ చెప్పారు. ఆ కథ ద్వారానే రాజకీయాల్లో నాగబాబుకు ఉన్న పరిజ్ఞానం ఎంతన్న విషయం బయటపడింది.

నాగబాబు అజ్ఞానానికి ‘ఉప్మాకథే’ నిదర్శనమా?
X

జగన్మోహన్ రెడ్డిపైన సెటైర్లు వేయటానికి జనసేన ప్రధాన కార్యదర్శి ఒక పద్ధ‌తిని ఎంచుకున్నారు. అదేమిటంటే పార్టీ ట్విట్టర్ ఖాతాలో కథాకళి పేరుతో నోటికొచ్చింది మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడటంలో లాజిక్కు కానీ మ్యాజిక్కు కానీ ఏమీ ఉండదు. కేవలం జగన్‌పైన అక్కసును తీర్చుకోవటమే. తాజా కథాకళిలో ఉప్మాకథ పేరుతో ఒక కంపేరిజన్ అంటూ ఎందుకూ పనికిరాని కథ చెప్పారు. ఆ కథ ద్వారానే రాజకీయాల్లో నాగబాబుకు ఉన్న పరిజ్ఞానం ఎంతన్న విషయం బయటపడింది.

ఇంతకీ నాగబాబు చెప్పిన ఉప్మాకథ ఏమిటంటే ఒక హాస్టల్లో 100 మంది పిల్లలున్నారట. ప్రతిరోజు టిఫిన్‌గా ఉప్మానే చేస్తున్నదట యాజమాన్యం. ప్రతిరోజు ఉప్మా తప్ప మరేమీ ఉండదా.. అంటూ విద్యార్ధులు బాగా గోల చేశారట. అయితే ఇందులో 20 మంది మాత్రం ఉప్మాను ఇష్టంగా తింటుంటారట. అయినా మిగిలినవాళ్ళ గోల భరించలేక యాజమాన్యం దిగొచ్చి రకరకాల టిఫిన్లు చెప్పిందట. ఓటింగ్ పెడతాం.. ఎక్కువ మంది పిల్లలు ఏ టిఫిన్ కావాలని అంటారో అదే టిఫిన్ రెడీ చేస్తామన్నారు.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఉప్మా కావాలని 20 మంది ఓటేస్తే మిగిలిన పిల్లల్లో కొందరు మసాలా దోసె, పూరీ, చపాతి, ఆలూ పరాట లాంటి వాటికి ఓట్లేశారట. అయితే ఎక్కువ మంది పిల్లలు అంటే 20 మంది ఉప్మాకే ఓటు వేశారు కాబట్టి మళ్ళీ ఉప్మానే చేస్తామని యజమాన్యం చెప్పిందట. ఉప్మా వద్దనే పిల్లలు 80 మంది ఉన్నా ఏకతాటిపైన లేకపోవటంతో మళ్ళీ ఉప్మానే తినాల్సొచ్చిందట.

దీన్ని తాజా రాజకీయాలకు నాగబాబు ముడిపెట్టి ఉప్మా ముఖ్యమంత్రి జగన్‌ను వద్దని మెజారిటీ జనాలు మొత్తుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు గనుక ఏకతాటిపైకి రాకపోతే మళ్ళీ ఉప్మా ముఖ్యమంత్రే అధికారంలోకి వస్తారని తేల్చారు. ఇక్కడ నాగబాబు మరచిపోయిందేమంటే 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని కోరుకున్న జనాలు 49.95 అంటే 50 శాతం. మిగిలిన అన్నీ పార్టీలు కలిసినా 50 శాతం ఓట్లు తెచ్చుకోలేదు. మరి నాగబాబు లెక్కలో జగన్ ఉప్మా ముఖ్యమంత్రి ఎలాగయ్యారు. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఇంకా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. కాబట్టి ఏరకంగా చూసినా జగన్ ఉప్మా సీఎం అవరు. ఈ కథలో బయటపడింది నాగబాబు రాజకీయ అజ్జానమే.

First Published:  11 Jun 2023 11:35 AM IST
Next Story