నేతల అకాల మరణాలతో తెలుగుదేశంలో ఆందోళన
ఓ వైపు 175 నియోజకవర్గాలకి పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసురుతోన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టిడిపిని ఆత్మరక్షణ ధోరణిలో పడేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో కీలక నేతల వరస మరణాలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. 2019లో వైసీపీ ఘన విజయంతో టిడిపిలో నిస్తేజం అలముకుంది. గెలిచిన 23 మందిలో నలుగురు వైసీపీ పంచన చేరారు. ఒకరేమో మౌనం దాల్చారు. అధికారపక్షంతో పోరాడలేక మొదట్లో చేతులెత్తేసి ప్రతిపక్ష టిడిపి. ఆ తరువాత రెండేళ్లు కోవిడ్ ప్రభావం. టిడిపి కమిటీలన్నీ ఆన్‌లైన్ సమావేశాలు, సమీక్షలకే పరిమితమయ్యాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత ప్రతిపక్ష టిడిపి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆరంభిస్తూ వస్తోంది.
ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని గ్రహించిన తెలుగుదేశం అధిష్టానం ఇన్చార్జిలు లేని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను వేసి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలలో సాగేలా ప్లాన్ చేసింది. ముందుగా బాదుడే బాదుడు అంటూ ప్రజల ముందుకు అధినేత చంద్రబాబు వచ్చారు. ఆ తరువాత అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ ప్రోగ్రాంలు మొదలయ్యాయి. పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ డిజైన్ చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. చాలాచోట్ల చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర కూడా ఆరంభించారు. ఇటు పార్టీ కేంద్ర కార్యక్రమాలు, అటు యువనేత పాదయాత్ర, అధినేత నియోజకవర్గాల పర్యటనలతో టిడిపిలో బిజీ బిజీ వాతావరణం నెలకొంది.
ఓ వైపు 175 నియోజకవర్గాలకి పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసురుతోన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టిడిపిని ఆత్మరక్షణ ధోరణిలో పడేస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకుంటే పార్టీ వీడేందుకు సిద్ధంగా నేతలు, పొత్తు పెట్టుకోకుంటే అధికారం దక్కకపోవచ్చనే అనుమానాల గందరగోళంలో టిడిపి అధిష్టానం ఉంది. ఇటువంటి సంధికాలంలో పార్టీలో కీలక నేతల ఆకస్మిక మృతితో కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వరుపుల రాజా గుండెపోటుతో మృతి చెందారు. అక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలి. గన్నవరం టిడిపి ఇన్చార్జి బచ్చుల అర్జునుడు మృతితో అక్కడా టిడిపిని నడిపించే నేత లేరు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించిన తారకరత్న పాదయాత్ర ప్రారంభం రోజున గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి ఆ తరువాత కన్నుమూశారు. కీలక నేతల ఆకస్మిక మరణాలు తెలుగుదేశం అధినాయకత్వంలో గుబులు రేపుతున్నాయి.