Unstoppable with NBK – Pawan Kalyan: రాష్ట్రమంతా నీఫ్యాన్సే.. మరి ఓట్లు ఎందుకు పడలేదు.. పవన్ పై బాలయ్య ప్రశ్నల వర్షం
Unstoppable with NBK – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, అతి త్వరలో ప్రసారం కానుంది. ఇవాళ ఈ ఎపిసోడ్ కు సంబంధించి టీజర్‌ను ఆహా విడుదల చేసింది.

ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రాంకు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో ఈ షో కేవలం ఎంటర్టైన్మెంట్ కే పరిమితం కాగా, ఈసారి మాత్రం ఈ షో రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. అన్‌స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ షో ద్వారా ఎన్టీఆర్ నుంచి టీడీపీని ఏ పరిస్థితుల్లో తమ చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు, బాలకృష్ణ వివరించారు. ఈ ఎపిసోడ్ తర్వాత కూడా అన్‌స్టాపబుల్ లో రాజకీయ సందడి సాగుతూనే ఉంది. మరో ఎపిసోడ్ కి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాగా, తాజా ఎపిసోడ్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇలా ఈ షో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, అతి త్వరలో ప్రసారం కానుంది. ఇవాళ ఈ ఎపిసోడ్ కు సంబంధించి టీజర్‌ను ఆహా విడుదల చేసింది. అందులో బాలకృష్ణ పలు విషయాలకు సంబంధించి పవన్ ను ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నీకు ఫ్యాన్ కాని వాడు లేడు.. ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కాలేదు? దీనిపై మీ ఉద్దేశం ఏమిటి? మీ అన్నయ్య చిరంజీవి నుంచి మీరు నేర్చుకున్నవి ఏంటీ? వద్దనుకున్నవి ఏంటీ? ఇలా పలు ప్రశ్నలను బాలయ్య పవన్ కు సంధించాడు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు మాత్రం టీజర్ లో చూపించలేదు. మొత్తానికి ఈ ఎపిసోడ్ బాలకృష్ణ, పవన్ మధ్య చాలా సరదాగా సాగినట్లు అర్థమవుతోంది. సినిమాల పరంగా ఎప్పుడూ పోటీగా ఉండే మెగా, నందమూరి హీరోలు ఒక వేదికపై కనిపించడంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా.. అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.