Telugu Global
Andhra Pradesh

ఏపీలోనూ బియ్యం కొనుగోలు ఆపేస్తారట

ఏపీలోనూ ధాన్యం, బియ్యం సేకరణ ఆపేస్తామని కేంద్ర ఆహార, పౌరసరఫరా శాఖ మంత్రి పియూష్ గోయల్ హెచ్చరించారు.

ఏపీలోనూ బియ్యం కొనుగోలు ఆపేస్తారట
X

తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణ ఆపేసి లక్షల టన్నుల ధాన్యం ఇటీవల భారీ వర్షాల బారినపడేలా చేసిన కేంద్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ తీరు మారకుంటే ఏపీలోనూ ధాన్యం, బియ్యం సేకరణ ఆపేస్తామని కేంద్ర ఆహార, పౌరసరఫరా శాఖ మంత్రి పియూష్ గోయల్ హెచ్చరించారు.

కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని గోయల్ ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని తక్షణం పంపిణీ చేయకపోతే ఏపీ నుంచి ధాన్యం, బియ్యం సేకరణను కేంద్రం ఆపేయాల్సి ఉంటుందన్నారు. ఏపీలో పీఎంజీకేఏవై కింద ఆరో దశలో ఉచిత పంపిణీ కోసం 8.04 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించామన్నారు.

ఏ రాష్ట్రమైన కేంద్రం కేటాయించిన ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందేనని.. అలా చేయని పక్షంలో అందుకు తగ్గ పరిణామాలను సదరు రాష్ట్రం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన భేటీలో ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఏపీ అధికారులను ప్రశ్నించగా.. తమకు కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులున్నాయని చెప్పారన్నారు. త్వరలోనే పంపిణీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కేంద్రమంత్రి చెప్పారు.

అయితే ఏపీలో ప్రత్యేకంగా కేంద్రానికి, రాష్ట్రానికి ఒక వివాదం నడుస్తోంది. ఏపీలో కోటి 45 లక్షల రేషన్ కార్డులున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 86 లక్షల కార్డులను మాత్రమే గుర్తించింది. తాము గుర్తించిన 86 లక్షల రేషన్ కార్డులకే బియ్యాన్ని ఇస్తామని.. మిగిలిన రేషన్ కార్డులతో తమకు సంబంధం లేదని కేంద్రం వాదిస్తోంది. దాంతో మిగిలిన 59 లక్షల రేషన్ కార్డుల భారాన్నీ రాష్ట్రమే సొంతంగా భరించాల్సి వస్తోంది.

ఇది తలకు మించిన భారం అవుతుండడంతో కేంద్రం ఇస్తున్న బియ్యం పంపిణీ విషయంలో రాష్ట్రం తర్జనభర్జన పడుతోంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని కొందరికి మాత్రమే పంపిణీ చేస్తే మిగిలిన లబ్దిదారులు రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీస్తారు. అందరికీ పంపిణీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 59 లక్షల కుటుంబాలకు సొంత ఖర్చుతో బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

First Published:  21 July 2022 2:10 AM GMT
Next Story