Telugu Global
Andhra Pradesh

మేఘా...స్వదేశీ పరిజ్ఞానానికి.. కేంద్ర మంత్రి ప్రశంసలు

అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన రిగ్ ను ఈ ప్రదర్శనలో చూడటం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి హర్దీప్ సింగ్ పూరి.

మేఘా...స్వదేశీ పరిజ్ఞానానికి.. కేంద్ర మంత్రి ప్రశంసలు
X

స్వదేశీ పరిజ్ఞానంతో ఆటోమాటిక్ రిగ్గులు తయారు చేసిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ కృషిని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభినందించారు. ఆ సంస్థ యాజమాన్యాన్ని ప్రశంసించారు. గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్-2024లో పాల్గొన్న ఆయన MEIL సంస్థ ప్రతిభను మెచ్చుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా.. స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేసే హైడ్రాలిక్ ఓవర్ రిగ్గులను MEIL, దాని అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ రూపొందించాయి.

ఇండియా ఎనర్జీ వీక్-2024లో స్వదేశీ పరిజ్ఞానంతో ఆటోమేటిక్ పద్దతిలో పనిచేసే HH 150 హైడ్రాలిక్ వర్క్ ఓవర్ రిగ్ లను MEIL, దాని అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ ప్రదర్శించాయి. ఈ రిగ్ లను కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, MEIL మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి పరిశీలించారు. వాటి పనితీరుని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో 55 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన అత్యంత అధునాతనమైన, భద్రతా పరమైన రిగ్ ను (డ్రిల్ మెక్ SPA ఇటలీ సాంకేతిక పరిజ్ఞానం) ఈ ప్రదర్శనలో చూడటం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ONGC కి MEIL సంస్థ 20 రిగ్ లను అందిస్తోందని, దేశ ఇంధన రంగ ప్రయాణంలో ఇదొక మంచి పరిణామం అని అయన పేర్కొన్నారు.


స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 20 అత్యాధునిక రిగ్గులు ONGCకి సరఫరా చేస్తున్నామని తెలిపారు MEIL మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి. వీటి తయారీలో ఉపయోగించిన 55 శాతం పనిముట్లు మన దేశంలోనే తయారయ్యాయని తెలిపారు. తమ సంస్థ ఇలాంటి మరిన్ని రిగ్గుల తయారీకి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ పటంలో చమురు, సహజ వాయు రంగంలో సముచిత స్థానంలో భారత్ ను నిలబెట్టేందుకు అవసరమైన ఉత్పాదనలను తమ సంస్థ సిద్ధం చేస్తుందన్నారు కృష్ణారెడ్డి.

గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్-2024లో MEIL అనుబంధ సంస్థలు మేఘా గ్యాస్, ఓలెక్ట్రా, ఈవేట్రాన్స్, ఐకామ్ కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, రవాణా, కమ్యూనికేషన్, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, స్వయం సమృద్ధి సాధనకు తమ కృషిని వివరించాయి.

First Published:  8 Feb 2024 4:59 PM IST
Next Story