రాజకీయాలొద్దు.. ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.8,406 కోట్లు
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం స్థలసేకరణను ప్రాధాన్యాంశంగా తీసుకుంటే దశాబ్దాల కలగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ విశాఖపట్నంలో ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైనట్లే.
రైల్వేల అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలు చెబుతున్న మాటల్నినమ్మొద్దని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల ఏర్పాటు, ఇప్పటికే ఉన్నవాటి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8,406 కోట్లు ఖర్చు పెడుతోందని ఆయన వెల్లడించారు.
భూమి కేటాయించగానే విశాఖలో..
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హమీ ప్రకారం విశాఖపట్నంలో తూర్పు కోస్తా రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 58 ఎకరాల భూమి చూపాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలసేకరణ పూర్తి చేయగానే రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటుకు పనులు ప్రారంభిస్తామన్నారు.
స్థలసేకరణలో పీటముడి వీడితే
విశాఖపట్నం శివార్లలోని ముడసర్లోవలో తూర్పు కోస్తా రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తదనంతర పరిణామాల్లో ఆ ప్రతిపాదన కాస్త నెమ్మదించింది. ఇన్నాళ్లూ జోన్ కార్యాలయం ఏర్పాటుపై పెద్దగా స్పందించని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్థలం ఇస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం స్థలసేకరణను ప్రాధాన్యాంశంగా తీసుకుంటే దశాబ్దాల కలగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ విశాఖపట్నంలో ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైనట్లే.