Telugu Global
Andhra Pradesh

భూమి అప్పగింతపై ఈ తప్పుడు ప్రకటన ఎలా అశ్వినీ వైష్ణవ్‌..?

తాను చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందువల్లనే రైల్వే జోన్‌ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వే మంత్రి ఒక తప్పుడు ప్రకటన చేశారు.

భూమి అప్పగింతపై ఈ తప్పుడు ప్రకటన ఎలా అశ్వినీ వైష్ణవ్‌..?
X

విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పిన విషయం వాస్తవం కాదని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్‌కు భూమిని కేటాయించలేదని ఆయన చెప్పారు. ఇది నిజం కాదు. కేంద్రం నిర్లక్ష్యాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టేశారు. రైల్వే జోన్‌కు అవసరమైన 52 ఎకరాల భూమిని గత చంద్రబాబు ప్రభుత్వం కేటాయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత విశాఖ రైల్వే జోన్‌కు 52 ఎకరాల భూమిని కేటాయిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైల్వే మంత్రి కప్పిపుచ్చారు.

ఈ విషయంపై గత నెల 2వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌ రైల్వే అధికారులకు లేఖ కూడా రాశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు రైల్వే శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖపట్నంలో 950 ఎకరాల భూమి అందుబాటులో ఉందని కూడా స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో రైల్వే జోన్‌ కార్యాలయాల నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటి ప్రస్తావన రాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టారు.

తాను చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందువల్లనే రైల్వే జోన్‌ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వే మంత్రి ఒక తప్పుడు ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 52 ఎకరాల భూమిని అప్పగించింది. టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆక్రమణలను వైసీపీ ప్రభుత్వం తొలగించింది. ఆ భూమిని ప్రభుత్వం పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకుంది. జీవీఎంసీ పరిధిలోని 57,58,59, 61, 62, 63,64, 65 సర్వే నెంబర్లు గల 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించింది. వాస్తవాలు ఇలా ఉండగా రైల్వే మంత్రి తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నట్లు మాట్లాడడం ఎందుకనేది ప్రశ్న.

First Published:  2 Feb 2024 10:26 AM IST
Next Story