Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసులో కీల‌క‌ మలుపు

సునీత, ఆమె భర్త ఒత్తిడి మేరకే రామ్ సింగ్ తనను బాగా హింసించినట్లు చెప్పారు. హత్యలో పులివెందులకు చెందిన నేతల ప్రమేయమున్నట్లుగా చెప్పాలని తనను పైముగ్గురు బాగా హింసించినట్లు చెప్పారు.

వివేకా హత్య కేసులో కీల‌క‌ మలుపు
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అనూహ్య మలుపు తిరిగింది. వివేకా కూతురు వైఎస్ సునీతతో పాటు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, అప్పట్లో కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు కేసులు నమోదుచేశారు. వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకే ఈ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వివేకా హత్య కేసులో తనను బెదిరిస్తున్నారంటూ కృష్ణారెడ్డి అప్పట్లోనే ముగ్గురిపైన పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు కృష్ణారెడ్డి ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో కృష్ణారెడ్డి కోర్టులో కేసు ఫైల్ చేశారు. పీఏ చేసిన ఆరోపణలు ఏమిటంటే.. హత్యకేసులో ఇన్వాల్వ్ మెంటు ఉందని తాము చెప్పినట్లుగా కొందరు పేర్లు చెప్పాలని రామ్ సింగ్, వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చినట్లు పిటీషన్‌లో పేర్కొన్నారు. వాళ్ళు చెప్పినట్లుగా తాను కొందరి పేర్లు చెప్పని కారణంగా తనను విచారణ పేరుతో రామ్ సింగ్ చిత్రహింసలు పెట్టినట్లుగా ఫిర్యాదుచేశారు.

సునీత, ఆమె భర్త ఒత్తిడి మేరకే రామ్ సింగ్ తనను బాగా హింసించినట్లు చెప్పారు. హత్యలో పులివెందులకు చెందిన నేతల ప్రమేయమున్నట్లుగా చెప్పాలని తనను పైముగ్గురు బాగా హింసించినట్లు చెప్పారు. జరిగిన విషయాన్ని తాను అప్పట్లోనే జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో తాను కోర్టులో కేసు వేయాల్సొచ్చిందని కృష్ణారెడ్డి తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఆ కేసును విచారించిన కోర్టు రామ్ సింగ్, సునీత, రాజశేఖరరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని జిల్లా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ముగ్గురిపైన కేసులు నమోదుచేసి విచారణ మొదలుపెట్టారు. మరి తాజా విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాల్సిందే. మొదటి నుంచి వివేకా హత్య కేసులో సునీత, ఆమె భర్త ప్రమేయంపై ఎన్ని అనుమానాలున్నా.. సీబీఐ మాత్రం పెద్దగా పట్టించుకోవటంలేదు. మరిప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి.

First Published:  18 Dec 2023 10:29 AM IST
Next Story