Telugu Global
Andhra Pradesh

అయ్యన్న విషయంలో బీజేపీ నుంచి టీడీపీకి ఊహించని మద్దతు..

ఏపీలో ఏ సమస్య ఉన్నా వైసీపీ, టీడీపీ రెండిటినీ కలిపి విమర్శించడం బీజేపీకి అలవాటు. అమరావతి విషయంలో అయినా, పోలవరం అయినా.. రెండు ప్రభుత్వాలది తప్పు అని అంటారు బీజేపీ నేతలు. కానీ అయ్యన్న అరెస్ట్ విషయంలో మాత్రం ఆయన్ను పూర్తిగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అయ్యన్న విషయంలో బీజేపీ నుంచి టీడీపీకి ఊహించని మద్దతు..
X

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా టీడీపీకి ఊహించని మద్దతు లభించింది. అర్ధ‌రాత్రి గోడలు దూకి, తాళాలు పగలగొట్టి అయ్యన్నను ఎలా లాక్కెళ్తారంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. పవన్ కల్యాణ్ ఇంటిపై రెక్కీ విషయంలో స్పందించేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన బీజేపీ నేతలు, పనిలో పనిగా అయ్యన్నను వెనకేసుకొచ్చారు.

వివేకానందరెడ్డి హత్యకేసులో ఆ చొరవ ఏమైంది..?

సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకుల్ని పట్టుకోవడంలో ఈ చొరవ ఏమైందంటూ ప్రశ్నించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని, హింసిస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే నేరస్థులు తప్పించుకోకూడదు అనుకుంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వం ఇంత తాత్సారం ఎందుకు చేస్తోందన్నారు. సీబీఐ పరిధిలో కేసు ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేసి కేసుని నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఊహించని మార్పేంటి..?

ఏపీలో ఏ సమస్య ఉన్నా వైసీపీ, టీడీపీ రెండిటినీ కలిపి విమర్శించడం బీజేపీకి అలవాటు. అమరావతి విషయంలో అయినా, పోలవరం అయినా.. రెండు ప్రభుత్వాలది తప్పు అని అంటారు బీజేపీ నేతలు. కానీ అయ్యన్న అరెస్ట్ విషయంలో మాత్రం ఆయన్ను పూర్తిగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఆక్రమణల గురించి ఏమాత్రం స్పందించకుండా, అరెస్ట్ గురించి మాత్రమే స్పందించారు బీజేపీ నేతలు. పరోక్షంగా టీడీపీకి మద్దతు పలికారు. ఊహించని ఈ మద్దతుకి టీడీపీ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. ఇప్పటి వరకూ జనసేనతోనే పొత్తు అంటున్న బీజేపీ నేతలు, రాబోయో రోజుల్లో టీడీపీని కూడా కలుపుకొని వెళ్తారనడానికి ఇది సంకేతంగా భావించాలేమో.

First Published:  4 Nov 2022 3:45 PM IST
Next Story