రామరాజు తిరుగుబాటు.. ఉండిలో టీడీపీకి ఎదురుదెబ్బ
టికెట్ వేరేవారికి కేటాయించారంటూ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు రామరాజు. కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో చిచ్చు రేగింది. ఇటీవల పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వబోతున్నారన్న ప్రచారంతో పార్టీలో అసమ్మతి రాజుకుంది. తాజాగా ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రామరాజు.. కంటతడి పెట్టుకున్నారు. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు తీరుతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
టికెట్ వేరేవారికి కేటాయించారంటూ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు రామరాజు. కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. రాజకీయాలు విరమించుకోవడంపైనా ఆలోచిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామరాజు తెలుగుదేశం పార్టీకి చేసిన అన్యాయం ఏంటి.. పార్టీ రామరాజుకు చేసిన న్యాయం ఏంటని ప్లకార్డులు ప్రదర్శించారు.
చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ లేదని సంకేతాలు ఇస్తుండడంతో రామరాజు వర్గం చంద్రబాబు తీరుపై మండిపడుతోంది. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తే సహించే ప్రసక్తే లేదని రామరాజు అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఉండి నియోజకవర్గ టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే శివరామరాజు, రామరాజు వర్గాలుగా విడిపోయిన టీడీపీ.. రఘురామరాజు ఎంట్రీతో మూడు ముక్కలయ్యేలా ఉంది.